‘సప్తసాగరాలు దాటి’ చిత్రంతో తన సహజ నటన, అందంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న రుక్మిణి వసంత్.. ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత బిజీ హీరోయిన్లలో ఒకరిగా మారుతోంది. మొదట్లో ఆమె కమర్షియల్ సినిమాలకు సరిపోరనే అభిప్రాయం వ్యక్తమైనా, తర్వాత వరుస చిత్రాలతో ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది.
ప్రత్యేకంగా ‘కాంతార: చాప్టర్-1’లో ఆమెకు దక్కిన అవకాశం, ఆ సినిమాపై ఏర్పడిన భారీ అంచనాలు రుక్మిణి కెరీర్‌కు మరింత బలం చేకూర్చాయి. ఇదే క్రమంలో ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’లో కథానాయికగా ఎంపికైంది. ఈ సినిమా విడుదలకు ముందే మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కించుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం, సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’ చిత్రంలో రుక్మిణి వసంత్ కీలక పాత్రలో కనిపించనుందట. ‘ఓ మై కడవులే’, ‘రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్’ చిత్రాలతో గుర్తింపు పొందిన అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన సిమ్రన్ కథానాయికగా నటిస్తుండగా, రాశి ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పుడు అదే చిత్రంలో మరో ముఖ్యమైన మహిళా పాత్ర కోసం రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఒకే సినిమాలో సిమ్రన్, రాశి ఖన్నా, రుక్మిణి వసంత్ వంటి ప్రముఖ నటీమణులు ఉండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న రుక్మిణి.. ‘ధర్మన్’ వంటి భారీ ప్రాజెక్ట్‌లో భాగమవుతుండటం ఆమె కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఇటీవల ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తి చేసిన రజినీకాంత్ ప్రస్తుతం ‘ధర్మన్’ చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.








