సెన్సార్ బోర్డుపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు.. ‘సినిమా చూడాలా వద్దా అనేది ప్రేక్షకుడి హక్కు’
కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఎప్పటికప్పుడు వివాదాస్పద అంశాలపై తనదైన శైలిలో స్పందించే వర్మ.. తాజాగా భారతీయ సినిమాల్లో అమలులో ఉన్న సెన్సార్ వ్యవస్థపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
సినిమాలకు సెన్సార్ విధించే విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ఆయన పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
‘సెన్సార్ అనేది ప్రేక్షకులను అవమానించడమే’
తన ఎక్స్ ఖాతాలో వర్మ మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో కూడా సినిమాలపై సెన్సార్ విధించడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు.
“స్మార్ట్ఫోన్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, సోషల్ మీడియా, అంతర్జాతీయ స్ట్రీమింగ్ సర్వీసులు అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో.. ఒక వ్యక్తి ఏ సినిమా చూడాలో ఒక కమిటీ నిర్ణయించడం పాత ఆలోచన” అంటూ ఆయన విమర్శించారు.
18 ఏళ్ల యువకుడికి దేశ భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కు ఇచ్చినప్పుడు.. అతను ఏ సినిమా చూడాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ కూడా ఉండాలని వర్మ పేర్కొన్నారు.
‘కత్తెర వేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు’
సినిమాల్లో కొన్ని సన్నివేశాలను తొలగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని వర్మ అన్నారు. థియేటర్లలో కట్ చేసిన కంటెంట్ కూడా సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు.
ప్రస్తుత కాలంలో పిల్లలు కూడా అనేక రకాల ఆన్లైన్ కంటెంట్ చూస్తున్నారని, అలాంటి పరిస్థితుల్లో కేవలం సినిమాలకే పరిమితులు విధించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదని.. సమాజంలోని అంశాలపై చర్చకు దారి తీసే శక్తివంతమైన కళారూపమని వర్మ అభిప్రాయపడ్డారు.
‘సెన్సార్ కాదు.. ప్రేక్షకుడికే నిర్ణయించే హక్కు ఇవ్వాలి’
దర్శకులు, నిర్మాతలు ఇకపై అనవసరమైన కోతలను అంగీకరించకుండా ఒకే వేదికపైకి రావాలని వర్మ పిలుపునిచ్చారు.
సినిమాల్లోని అంశాల గురించి స్పష్టమైన సమాచారం ఇచ్చి.. ఆ కంటెంట్‌ను చూడాలా వద్దా అనేది పూర్తిగా ప్రేక్షకుల నిర్ణయానికి వదిలేయాలని అన్నారు.
ఈ సందర్భంగా #BanTheCensor అనే హ్యాష్‌ట్యాగ్‌తో తన అభిప్రాయాన్ని పంచుకున్న వర్మ.. సెన్సార్ వ్యవస్థపై కోర్టుల్లో, ప్రజా చర్చల్లో సవాలు చేసే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.
వర్మ వ్యాఖ్యలపై ఇండస్ట్రీలో చర్చ
ఇక రామ్ గోపాల్ వర్మ విషయానికి వస్తే.. ఆయన దర్శకత్వం వహించిన పొలిటికల్ డ్రామా ‘రక్త చరిత్ర’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరోవైపు నిజ జీవిత సంఘటనల ఆధారంగా హిందీలో ఓ కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు.
మొత్తానికి సెన్సార్ వ్యవస్థపై వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. ఆయన అభిప్రాయాలతో ఏకీభవించే వారు ఉన్నప్పటికీ.. దీనిపై సినీ ప్రముఖులు ఎలాంటి స్పందన ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.








