కాకినాడ జిల్లా అన్నవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నవరం దేవస్థానంలో అదనపు వ్రతపురోహితుడుగా పనిచేస్తున్న పైన రఘునాధ శర్మ(20) తన విధుల నిమిత్తం అన్నవరం కొండపైకి వెళ్తుండగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాజమండ్రి నుంచి తుని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్ లోకి మలుపు తిరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కాంప్లెక్స్ లోకి మలుపు తిరిగే సమయంలో పురోహితుడు రఘునాథ్ శర్మ తన ద్విచక్ర వాహనంతో పాటు బస్సు మధ్య భాగంలోకి వెళ్లిపోవడంతో అతని తలపై బలంగా గాయమైంది. దీంతో రఘునాథ శర్మ అక్కడికక్కడే మృతి చెందాడు. తుని డిపో మేనేజర్ సంఘటన స్థలానికి పూటాహుటిన చేరుకొని పరిశీలించారు. ఇక్కడ మలుపుచోట తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.









