నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ విడుదల వాయిదా పడింది. ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న రెండో చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 26, 2026న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించినప్పటికీ, షూటింగ్ బ్యాలెన్స్ ఉండటం మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల జాప్యం కారణంగా ఇప్పుడు తేదీని మార్చారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఐదు నెలల పాటు వెనక్కి వెళ్ళింది. ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. టాలీవుడ్లో ప్రస్తుతం కొనసాగుతున్న రిలీజ్ డేట్స్ మార్పుల పర్వంలో నాని సినిమా కూడా చేరిపోయింది. మార్చి 26 ఖాళీ అవ్వడంతో, ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని గత చిత్రం ‘దసరా’ కంటే రెట్టింపు బడ్జెట్తో, ప్యాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ గ్యాప్లో నాని తన ఇతర ప్రాజెక్టులపై దృష్టి సారించనున్నారు. పెండింగ్ ఉన్న భారీ యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేసేందుకు ఈ సమయాన్ని చిత్ర యూనిట్ వినియోగించుకోనుంది. ఆగస్టు నెలలో లాంగ్ వీకెండ్స్ కలిసి వస్తాయనే ఉద్దేశంతోనే ఈ కొత్త తేదీని మేకర్స్ లాక్ చేసినట్లు తెలుస్తోంది.








