మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతికి విడుదలై రూ.375 కోట్ల భారీ వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ కావడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఆయన తదుపరి చిత్రం ‘విశ్వంభర’పై పడింది. బింబిసార ఫేమ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా విడుదల తేదీపై ఉన్న సందిగ్ధతకు తెరదించుతూ చిత్ర యూనిట్ శివరాత్రి పర్వదినాన ఒక క్రేజీ అప్డేట్ను ఇచ్చేందుకు సిద్ధమైంది.
మహా శివరాత్రి సందర్భంగా ‘విశ్వంభర’ చిత్రం నుండి సుమారు 30 సెకన్ల నిడివి గల ఒక ప్రత్యేక టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ టీజర్ ద్వారానే సినిమా అధికారిక విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన రావడంతో, ఇప్పుడు రాబోయే కొత్త టీజర్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ గ్రాఫిక్స్ మరియు విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది.
అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం జూలై 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. నిజానికి 2025 సంక్రాంతికే ఈ సినిమా రావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం మెగాస్టార్ ఫుల్ ఫామ్‌లో ఉండటంతో, పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్న ‘విశ్వంభర’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అని ట్రేడ్ వర్గాలు సైతం ఆసక్తిగా గమనిస్తున్నాయి.









