‘చంటిగాడు’ సినిమాతో కేవలం 15 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరకు పరిచయమైన సుహాసిని, ప్రస్తుతం సీరియల్స్ మరియు టీవీ షోలలో నటిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె టాలీవుడ్ దిగ్గజాలు చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్‌లతో తనకున్న అపురూపమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. మెగా స్టార్ డ్యాన్స్‌కు తాను పెద్ద అభిమానినని, ఆయన తన పేరు గుర్తుపెట్టుకుని పలకరించడం తన జీవితంలో ఒక మర్చిపోలేని అనుభూతి అని ఆమె పేర్కొన్నారు.
చిరంజీవితో జరిగిన పరిచయం గురించి చెబుతూ.. తన మొదటి సినిమా తర్వాత ఒక సినిమా ఓపెనింగ్ వేడుకలో చిరంజీవిని కలిశానని సుహాసిని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో దర్శకురాలు జయ గారు తనను పరిచయం చేస్తుండగానే, చిరంజీవి గారు వెంటనే స్పందిస్తూ “తెలుసు.. సుహాసిని కదా, బాగున్నావమ్మా” అని పేరుతో సహా పిలిచారని తెలిపారు. అంత పెద్ద స్టార్ హోదాలో ఉండి కూడా, ఒక చిన్న నటిని గుర్తుపెట్టుకుని పలకరించడం తనను ఎంతో ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసిందని ఆమె వివరించారు.
ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమ 75 ఏళ్ల వజ్రోత్సవ వేడుకల సమయంలో సావిత్రి గారి పాటపై తాను చేసిన పెర్ఫార్మెన్స్ను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారని సుహాసిని తెలిపారు. వేడుక ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా తన దగ్గరకు వచ్చి, “సావిత్రి గారి పాట బాగా చేశారు” అని మెచ్చుకున్నారని, ఆ క్షణం తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినట్లు అనిపించిందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ రెండు సందర్భాలు తన సినీ ప్రయాణంలో అత్యంత స్పెషల్ మూమెంట్స్ అని సుహాసిని ఎమోషనల్ అయ్యారు.









