జనవరి నెలలో పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరగ నున్నాయి. ఈమేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కలెక్టరేట్ కోర్టు హాలులో అధికారులతో నిర్వహించిన సమీక్షలో వివరాలు వెల్లడించారు. కాకినాడ జగన్నాథపురం వద్ద బోట్ ర్యాలీ కూడా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ వేడుకల వివరాలను, తేదిలను త్వరలో వెల్లడిస్తామన్నారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు ప్రజల సాంప్ర దాయాలను, కాకినాడ జిల్లా విశిష్టత లను చాటుతూ పిఠాపురం పట్టణంలో మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలను నిర్వహించేందుకు నిర్ణయించామని తెలిపారు. ఈ సంబరాల తేదీల నిర్వహణకు అనువైన తేదీలను నిర్ణయించి ప్రకటిస్తా మన్నారు. ఈనెల 29న పిఠాపురం పట్టణంలో పర్యటించి ఈ వేడుకల నిర్వహణకు అనువైన ప్రదేశాలను ఎంపిక చేస్తామన్నారు.ఈ సమా వేశంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్ఓ జె.వెంకటరావు, టూరిజం అధికారి, జడ్పి సిఈఓ వివివిఎస్ లక్ష్మణ్, మత్స్యశాఖ జేడి కృష్ణారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సంబరాల్లో కళా ప్రదర్శనలెన్నో
సంక్రాంతి సంబరాల్లో హరిదాసు, గంగిరెద్దులు, కోలాటం, దింసా, వీరనాట్యం, గరగలు, తప్పెటగుళ్లు, డప్పులు, లంబాడీ, కొమ్ముకోయ, కొమ్మదాసరి తదితర సాంప్రదాయ, జానపద కళారూపాలతో పాటు భరతనాట్యం, కూచిపూడి శాస్త్రీయ కళా ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. మహిళలకు రంగోళి ముగ్గుల పోటీలు, పిల్లలకు కల్చరల్, క్రీడాపోటీలు, పంతంగుల పండుగ, మ్యూజికల్ నైట్ కార్యక్రమాలను కూడా సంబరాల్లో నిర్వహించాలన్నారు. ఈ సంబరాల్లో పాల్లొనే సుమారు 250 నుండి 300 మంది కళాకారులు లకు వసతి, భోజన సదుపాయాలు, వేడుకల నిర్వహణకు ముచ్చటైన వేదికలు ఏర్పాటు చేయాలని తెలిపారు. వ్యవసాయ, మత్య్స శాఖల ఆధ్వర్యంలో గ్రామీణ శోభ ఉట్టిపడేలా స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.అలాగే జనవరి నెలాఖరిలో కాకినాడ జగన్నాధపురం వద్ద ఉప్పుటేరులో రెండు రోజుల పాటు బోట్ రేసింగ్ ర్యాలీని నిర్వహించనున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ ర్యాలీలో సాంప్రదాయ మత్స్యకారులకు, ప్రోఫెషనల్ క్రీడాకారులకు వేరువేరు బోటింగ్ పోటీలు నిర్వహించేందుకు సన్నాహక ఏర్పాట్లు చేపట్టాలని ఆయన కోరారు.









