బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా, మూడో వీకెండ్‌లో సైతం సెన్సేషనల్ రాంపేజ్ చూపిస్తూ ఆల్‌టైమ్ రికార్డులను బద్దలు కొట్టింది. ముఖ్యంగా 17వ రోజున అంచనాలను మించి ఏకంగా రూ.40 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించి బాలీవుడ్ హిస్టరీలోనే ఎపిక్ రికార్డ్ నమోదు చేసింది. పోటీలో ఉన్న భారీ హాలీవుడ్ చిత్రం ‘అవతార్ 3’ను కూడా కలెక్షన్ల పరంగా డామినేట్ చేస్తూ ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా విపరీతమైన బజ్‌ను క్రియేట్ చేయగా, హైదరాబాద్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని హిందీలోనే చూసేందుకు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో తొలుత తెలుగులో డబ్ చేసి డిసెంబర్ 19న విడుదల చేయాలని భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మేకర్స్ ఆ ప్లాన్‌ను రద్దు చేసుకున్నారు. సినిమా విడుదలై ఇప్పటికే రెండు వారాలు దాటిపోవడంతో, ఆసక్తి ఉన్న తెలుగు ప్రేక్షకులు హిందీలోనే వీక్షించారని, ఇప్పుడు తెలుగు వెర్షన్ తీసుకురావడం వల్ల అదనపు రిస్క్ ఉంటుందని డిస్ట్రిబ్యూటర్లు భావించడమే దీనికి ప్రధాన కారణం.
మొదటి భాగం సాధిస్తున్న అద్భుత విజయంతో మేకర్స్ ఇప్పటికే ‘ధురంధర్ 2’పై పూర్తి దృష్టి పెట్టారు. ప్రస్తుతం సీక్వెల్ షూటింగ్ శరవేగంగా సాగుతోందని, ఇప్పటికే 70 నుంచి 80 శాతం వరకు చిత్రీకరణ పూర్తైనట్లు సమాచారం. అయితే, సీక్వెల్ విషయంలో మాత్రం మేకర్స్ తెలుగు ప్రేక్షకులకు తీపి కబురు అందించారు. పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని, ‘ధురంధర్ 2’ను మార్చి 19, 2026న హిందీతో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ స్పై థ్రిల్లర్ రణవీర్ సింగ్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.









