‘అఖండ 2’ సినిమా విడుదలైన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా భారీ స్పందన పొందుతోంది. థియేటర్ల వద్ద సెలబ్రేషన్లు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు సినిమా హిట్ టాక్‌ను మరింత బలపరుస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఫిలడెల్ఫియాలోని NBK ఫ్యాన్స్ షో అనంతరం ఒక అభిమాని బాలయ్యకు ఫోన్ చేసి సినిమా ఎలా నచ్చిందో చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. “బాలయ్య బంప్స్, బోయపాటి బంప్స్ వచ్చాయి” అంటూ అభిమాని చెప్పగా, బాలయ్య “థాంక్యూ సో మచ్” అంటూ సంతోషం వ్యక్తం చేశారు.
బాలకృష్ణ–బోయపాటి కాంబినేషన్ మళ్లీ బాక్సాఫీస్‌ను రగిలించింది. ఎన్నో అవాంతరాలను దాటుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అఖండ 2’ అంచనాలకు మించి స్పందన అందుకుంటోంది. థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సెలబ్రేషన్ వీడియోలు, ఫ్యాన్స్ సంబరాలతో ఈ చిత్రం నిజమైన పండగ వాతావరణం సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లో ఉన్న తెలుగు ప్రేక్షకులు కూడా భారీగా థియేటర్లకు చేరి మాస్ ఫెస్టివల్‌ని ఆస్వాదిస్తున్నారు. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, విడుదలైన కొద్ది గంటల్లోనే సినిమా బలమైన ఓపెనింగ్స్ నమోదు చేసి మొదటి రోజే అనూహ్యమైన కలెక్షన్ రాబట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఈ విజయోత్సాహంలోనే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ప్రీమియర్ షో చూసిన తర్వాత ఒక అభిమాని స్వయంగా బాలకృష్ణకు ఫోన్ చేసి తన ఆనందాన్ని పంచుకోవడం నెట్టింట హైలైట్‌గా మారింది. అఖండ 2 విడుదలైన తర్వాత మొదటిసారిగా బాలయ్య ఒక అభిమాని ఫోన్‌కు స్పందించడంతో ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఫోన్‌లో మాట్లాడిన ఆ అభిమాని సినిమా గురించి అమితమైన ఉత్సాహంతో ప్రశంసలు కురిపించాడు. “సినిమా చూస్తుంటే మామూలుగా గూస్ బంప్స్ వస్తాయి… కానీ ఈసారి బాలయ్య బంప్స్, బోయపాటి బంప్స్, తమన్ బంప్స్ వచ్చాయి అండి!” అంటూ చెప్పడంతో బాలకృష్ణ నవ్వుతూ “థాంక్యూ సో మచ్” అంటూ స్పందించారు.








