తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రముఖుల నివాసాలు, కార్యాలయాలకు వరుసగా బాంబు హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో, తాజాగా ప్రముఖ నటి త్రిష నివాసానికి మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని ఆళ్వార్‌పేట్‌లో ఉన్న త్రిష నివాసంలో బాంబు పెట్టినట్లుగా డీజీపీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. నటి నివాసానికి ఇలా బెదిరింపులు రావడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఈ వరుస బెదిరింపులు నగరంలో ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ బెదిరింపు మెయిల్ అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు. డాగ్‌స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో త్రిష నివాసానికి చేరుకొని విస్తృత తనిఖీలు నిర్వహించారు. అయితే, ఈ తనిఖీల్లో పోలీసులకు ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. దీంతో ఇది బూటకపు బెదిరింపుగా పోలీసులు నిర్ధారించారు.
ఈ ఘటనపై తేనాంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బూటకపు బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ వరుస బెదిరింపుల వెనుక కారణాలు, ఉద్దేశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.









