పిఠాపురం నియోజక వర్గంలో చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో కూటమి స్ఫూర్తి ప్రతిఫలించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పాలన చేపట్టిన తొలి యేడాదిలోనే నియోయజకవర్గంలో రూ.400 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామంటే, అది నియోజకవర్గం అబివృద్ధి పట్ల ఉన్న ప్రణాళికాబద్ధమైన ఆలోచన, నిబద్ధతే కారణమన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతం సమస్యలు, అభివృద్ధి పనులను తెలుసుకొనేలా రియల్ టైం వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. కూటమి ఐక్యతే బలం, అప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యం, ఈ వాస్తవాన్ని ఎవరూ విస్మరించవద్దని పవన్ చెప్పారు.
నియోజకవర్గమే ప్రధాన అజెండా
ఆదివారం రాత్రి పిఠాపురం నియోజకవర్గం జన సైనికులు, వీర మహిళలు, నాయకులతో ప్రత్యేక సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని 52 గ్రామాలు, పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీ నుంచి ఈ సమావేశానికి వచ్చారు. వారి నుంచి వారి ప్రాంతాల్లోని సమస్యలు, పార్టీ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది కాలంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, పనుల పురోగతిని వివరించారు.
కోపతాపాలు పక్కన పెట్టండి కూటమి కష్టాన్ని వివరించండి
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “నియోజకవర్గంలో చేపట్టి ప్రతి అభివృద్ధి పని గురించి చెప్పేటప్పుడు, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల కృషిని ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. కూటమిగా ఐక్యత చూపాలి. కోపతాపాలకు, వ్యాఖ్యలకు ఏ మాత్రం తావు లేదు. అదే సమయంలో జనసేన కోసం తొలి నుంచి నిస్వార్థంగా నిలిచిన ప్రతి కార్యకర్తకీ తగిన గుర్తింపు ఇస్తాము. ఇందుకోసం ప్రతి గ్రామం నుంచి అయిదుగురు పార్టీ సభ్యులతో కేంద్ర కార్యాలయం అనుసంధానం అవుతుంది. వారి ద్వారా తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కోరుకొంటున్నారు, ఉన్న సమస్యలు ఏమిటి, పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా సాగుతున్నాయో తెలుసుకుంటాను. ఆ అయిదుగురు ఎవరు అనేది ఆ గ్రామంలోని జనసేన క్రియాశీలక సభ్యులు, నాయకులే నిర్ణయించుకొని కేంద్ర కార్యాలయానికి తెలియచేయాలి. అని పవన్ అన్నారు.
ప్రతి నెలా రెండుసార్లు నియోజకవర్గ సమీక్ష
ఉప్పాడలో తీర ప్రాంతం కోత సమస్యను జనవాణిలో నా దృష్టికి తెచ్చారు. ఆ సమస్యను గౌరవ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకి వివరించానని వెల్లడించారు. అధునాతన సాంకేతికతతో రక్షణ గోడ నిర్మాణం ముందుకు తీసుకువెళ్తున్నాము అంటే కేంద్ర సహకారం అందుతోంది కాబట్టే. అదే విధంగా ఉప్పాడ నుంచి కాకినాడ వరకూ బీచ్ రోడ్డును అభివృద్ధి చేసి వాణిజ్య కార్యక్రమాలు చేపట్టాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించినట్లు తెలిపారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారని పవన్ వివరించారు. విద్యా , వైద్య సంబంధిత సమస్యలు కావచ్చు, ఇతర సమస్యలపై స్పందించేందుకు తన కార్యాలయంలో తగిన వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రైతన్నల కష్టాన్ని చూడండి : పవన్
సాగు నీటి సమస్యలు, పంట కాలువల మరమ్మతులలో సమస్యలను ఈ సమావేశంలో పవన్ ప్రస్తావించారు. వాటి పరిష్కారంపై ఇరిగేషన్ అధికారులతో, నియోజక వర్గంలోని నీటి సంఘాల ప్రతినిధులతో చర్చించాలని పేషీ అధికారులను ఆదేశిస్తానన్నారు. పిఠాపురం నియోజక వర్గం ప్రజలు ఆకాంక్షలు మరచిపోలేదు. వారు కోరుకున్న మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించానన్నారు. నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తాను. మత్స్యకారులు తెలియచేసిన సమస్యలను సత్వరమే పరిష్కరించే చర్యలు చేపడతామని వివరించారు.
ఎన్నికల ప్రచారాన్ని ప్రస్తావించిన పవన్
నామినేషన్ వేయడానికి ముందు దర్గాకు వెళ్ళి వస్తుంటే ఇసుకపల్లి గ్రామం దగ్గర్లో కొబ్బరి బొండాలు అమ్ముకునే వ్యక్తి నాకు ఓ బొండం కొట్టి ఇచ్చారు. ఆయనతో మాట్లాడినప్పుడు మీరు గెలిచాక ఇల్లు మంజూరు చేయించమన్నారు. ఆయన్ని మరచిపోలేదు. పేరు, ఆధార్ నంబర్, అన్ని వివరాలు కావాలని నా కార్యాలయాన్ని అడిగాను. ఆయన పేరు జుత్తుక తాతబ్బాయి, నాగులపల్లి శివారు గ్రామంలో ఉంటారు అని చెప్పారు. ఏ విషయాన్నీ తాను మరచిపోనని పవన్ అన్నారు. ప్రతి నెలా రెండుసార్లు నియోజకవర్గం సమీక్ష నిర్వహిస్తాను. ఆ సందర్భంగా అధికారులతోనూ, పార్టీ శ్రేణులతో, వివిధ వర్గాల ప్రతినిధులతోను మాట్లాడతాను. అని పవన్ స్పష్టం చేశారు.
పిఠాపురానికి ప్రత్యేక కమిటి
నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణను ప్రణాళికాబద్ధంగా చేపట్టడంపై కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, పి.హరిప్రసాద్, తుమ్మల బాబు, పెండెం దొరబాబు, మర్రెడ్డి శ్రీనివాస్ లు నియోజకవర్గ నాయకులను కలుపుకొని రెండు వారాల్లో ఒక నివేదిక ఇవ్వాలి . పార్టీ కోసం మొదటి నుంచి ఉన్నవారిని తగిన విధంగా గుర్తించాలి” అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్, ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు కె.నాగబాబు, పిడుగు హరిప్రసాద్, కాకినాడ జిల్లా డి.సి.సి.బి. అధ్యక్షుడు తుమ్మల బాబు, టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.