అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ రూరల్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా ‘లెనిన్’ గురించి ఓ క్రేజీ అప్డేట్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ సినిమాను జూలై 10న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించగా, ఇప్పుడు మరో సర్ప్రైజ్ న్యూస్ అభిమానులను ఉత్సాహపరుస్తోంది.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఈ సినిమాకు ఓ స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ స్టార్ హీరో మరెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి అని టాక్ వినిపిస్తోంది.
సినిమా ప్రారంభంలో కథను పరిచయం చేసే నరేషన్‌ను చిరంజీవి తన పవర్ఫుల్ వాయిస్‌తో చెప్పనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, కేవలం ఇంట్రడక్షన్కే పరిమితం కాకుండా.. కథలో అత్యంత కీలకమైన ప్రీ-ఇంటర్వెల్ సీన్‌తో పాటు క్లైమాక్స్‌లో కూడా మెగా వాయిస్ వినిపించబోతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.
చిరంజీవి వాయిస్ ఓవర్ ఈ సినిమాకు మరింత వెయిట్ తీసుకురావడమే కాకుండా, ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే అంశంగా మారనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అక్కినేని, మెగా కుటుంబాల మధ్య ఉన్న మంచి అనుబంధం కారణంగానే చిరంజీవి ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా, సంగీత దర్శకుడు తమన్ సంగీతం అందిస్తున్నారు.
అయితే మెగాస్టార్ వాయిస్ ఓవర్ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వార్త నిజమైతే మాత్రం ‘లెనిన్’ సినిమాపై హైప్ మరింత పెరగడం ఖాయమనే చెప్పాలి.









