రూ.4,000 కోట్ల ‘రామాయణం’.. రిలీజ్‌కు ముందే షాకింగ్ లీక్! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 11 సెకన్ల వీడియో!
సాధారణంగా రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కే సినిమాలకే మేకర్స్ భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తుంటారు. షూటింగ్ నుంచి రిలీజ్ వరకు ఎక్కడా ఒక్క లీక్ కూడా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది ఏకంగా రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా అయితే సెక్యూరిటీ ఇంకెంత కఠినంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.
కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా బాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం’ తరచూ లీకుల కారణంగా వార్తల్లో నిలుస్తోంది. షూటింగ్ ఫొటోలు, సెట్స్ చిత్రాలు, ఇప్పుడు ఏకంగా ట్రైలర్ క్లిప్ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అభిమానుల్లో ఆసక్తితో పాటు అనేక సందేహాలు కూడా మొదలయ్యాయి.
11 సెకన్ల వీడియోతో సోషల్ మీడియాలో సంచలనం!
రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ మైథలాజికల్ విజువల్ ఎపిక్పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 11 సెకన్ల వీడియో.. ఇటీవల జరిగిన CinemaCon ఈవెంట్లో ప్రదర్శించిన అధికారిక ప్రివ్యూ నుంచి లీకైందని ప్రచారం జరుగుతోంది.
ఈ వీడియో నిజమా? కాదా? అన్నది ఇంకా అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
వీడియోలో ఏముంది?
వైరల్ అవుతున్న క్లిప్‌లో రణబీర్ కపూర్ శ్రీరాముడి అవతారంలో ఓ భారీ రాక్షసుడిపై బాణం సంధించేందుకు సిద్ధంగా కనిపిస్తారు. అయితే ప్రేక్షకుల దృష్టి రాముడి పాత్రపై కంటే.. ఎదురుగా ఉన్న ఆ భారీ జీవిపైనే ఎక్కువగా పడుతోంది.
ఆ ఆకారాన్ని చూసిన కొందరు నెటిజన్లు అది ‘కింగ్ కాంగ్’ లేదా ‘గాడ్జిల్లా’ను గుర్తు చేస్తోందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం రామాయణంలో ఇలాంటి రాక్షసుడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్నిస్తున్నారు.
ట్రోల్స్, మీమ్స్‌తో నిండిపోయిన సోషల్ మీడియా
వీడియో బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తాయి. కొందరు ఇది హాలీవుడ్ ‘లోకీ’ సిరీస్ విజువల్స్‌లా ఉందని కామెంట్ చేస్తుంటే, మరికొందరు ‘ఆదిపురుష్’ వైబ్స్ మళ్లీ కనిపిస్తున్నాయని అంటున్నారు.
ఇంకా కొందరు.. “ఇలాంటి విజువల్స్ కోసమేనా రూ.4,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు?” అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో సినిమా విడుదలకు ముందే ఈ వీడియో చుట్టూ పెద్ద చర్చ మొదలైంది.
అసలు ఇది నిజమైన లీక్నా.. లేక AI సృష్టినా?
అయితే మరోవైపు.. వైరల్ అవుతున్న ఈ వీడియో నిజంగానే అధికారిక ట్రైలర్ నుంచి లీకైందా? లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారు చేసిన ఫేక్ వీడియోనా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే చిత్రబృందం అధికారికంగా స్పందించాల్సిందే. మేకర్స్ గ్లింప్స్ లేదా ట్రైలర్ విడుదల చేసిన తర్వాతే ఈ వైరల్ వీడియో వెనుక ఉన్న అసలు నిజం బయటపడే అవకాశం ఉంది.
మొత్తానికి రూ.4,000 కోట్ల భారీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ‘రామాయణం’ విడుదలకు ముందే లీకులు, ట్రోల్స్‌తో వార్తల్లో నిలుస్తోంది. ఈ వివాదాలకు చెక్ పెట్టి ప్రేక్షకుల్లో మళ్లీ నమ్మకం కలిగించాలంటే చిత్రబృందం త్వరలోనే అధికారిక విజువల్స్ విడుదల చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.









