ఒకప్పుడు టాలీవుడ్లో నవంబర్, డిసెంబర్ నెలలను పెద్ద సినిమాలకు అనుకూలం కాదని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత కొన్నేళ్లుగా డిసెంబరులో విడుదలైన భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ విజయాలు సాధించడంతో, స్టార్ హీరోలందరూ ఈ సీజన్‌పై ఫోకస్ పెడుతున్నారు.
ఇక ఈ ఏడాది డిసెంబర్ బాక్సాఫీస్ మరింత ఆసక్తికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాలతో ఒకే సమయంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో బలమైన టాక్ వినిపిస్తోంది.
ఒకవైపు రెబెల్ స్టార్ ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా **‘ఫౌజీ’**ని ఈ ఏడాది డిసెంబరులోనే విడుదల చేయాలని మేకర్స్ పట్టుదలగా ఉన్నారట. ముఖ్యంగా డిసెంబర్ 3 తేదీని రిలీజ్‌కు అనుకూలంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ కూడా డిసెంబర్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదట ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా విడుదల చేయాలనుకున్నప్పటికీ, షూటింగ్ ఆలస్యం కావడంతో ప్లాన్ మార్చి డిసెంబర్ 4ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలు నిజమైతే… కేవలం ఒక్క రోజు వ్యవధిలో ప్రభాస్, బాలకృష్ణ సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. దీంతో ఈసారి డిసెంబర్ బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రిలీజ్ డేట్లపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.








