కన్నడ రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాపై భారీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఆగిపోయిందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు మేకర్స్ ఒక్క ప్రకటనతో ఫుల్ స్టాప్ పెట్టేశారు.
తాజాగా చిత్రబృందం సరికొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ, సినిమాను 2026 ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ పోస్టర్‌లో యశ్ రెండు విభిన్నమైన అవతారాల్లో కనిపిస్తూ ఫ్యాన్స్‌లో ఆసక్తిని మరింత పెంచేశాడు.
పోస్టర్‌ను బట్టి చూస్తే ఇది కేవలం తండ్రీ-కొడుకుల కథ మాత్రమే కాదు. అధికారం, భావోద్వేగాలు, సంఘర్షణలతో నిండిన ఒక ఇంటెన్స్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. యశ్ పోషిస్తున్న ‘రాయ’ మరియు ‘టికెట్’ పాత్రల చుట్టూ కథ తిరగనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇక రిలీజ్ డేట్ విషయంలో కూడా మేకర్స్ మాస్టర్ ప్లాన్ అమలు చేశారు. వరలక్ష్మీ వ్రతం, ఓనం, ఈద్, రక్షాబంధన్ వంటి వరుస పండుగలు వచ్చే సమయంలో సినిమాను విడుదల చేస్తుండటంతో భారీ హాలిడే అడ్వాంటేజ్ దక్కనుంది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఈ చిత్రానికి బలమైన ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొదట ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేయాలని భావించగా, తర్వాత జూన్ 4కు వాయిదా వేశారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో భారీ రిలీజ్ ప్లాన్ చేయడంతో పాటు గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాల కారణంగా విడుదల తేదీని మరికొంత వెనక్కి జరిపారు.
విలక్షణ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, యశ్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో పాటు ఇంగ్లీష్ భాషలో కూడా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండటంతో ‘టాక్సిక్’పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.









