భారతీయ సినీ చరిత్రలో ఎన్నో రికార్డులను తిరగరాసిన చిత్రం ‘బాహుబలి’. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ కేవలం బాక్సాఫీస్ వద్దే కాదు, ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా మరో స్థాయికి తీసుకెళ్లింది. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం అనేక సంచలన రికార్డులను సృష్టించి ఇండస్ట్రీ రూపురేఖలను మార్చేసింది.
ఇటీవల రీ-రిలీజ్లోనూ అద్భుతమైన స్పందన అందుకున్న ‘బాహుబలి’ ఫ్రాంచైజీ, ఓటీటీలో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ప్రత్యేక వెర్షన్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
అయితే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ మరో ఆసక్తికరమైన సర్ప్రైజ్తో ఫ్యాన్స్‌ను ఉత్సాహపరుస్తోంది. ‘Baahubali: The Torch Bearer’ పేరుతో ఓ కొత్త వెర్షన్‌ను సడెన్‌గా అనౌన్స్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నెట్‌ఫ్లిక్స్ హోమ్‌పేజ్‌లో ఈ టైటిల్ కనిపించడంతో అభిమానుల్లో భారీ చర్చ మొదలైంది.
అయితే ఈ కొత్త వెర్షన్ అసలు ఏమిటి? ఇందులో కొత్త సన్నివేశాలు ఉంటాయా? లేక బాహుబలి ప్రపంచానికి సంబంధించిన మరో ప్రత్యేక కథనా? అనే విషయాలపై ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్ గానీ, చిత్రబృందం గానీ ఎలాంటి అధికారిక వివరాలు వెల్లడించలేదు. దీంతో ‘ది టార్చ్ బేరర్’ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటన్నది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది.
ఇక ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రల్లో నటించగా, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. శోభు యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రాన్ని రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.
మరి ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ ఏ రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుందో చూడాలి.









