పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా భారీ సినిమాలతో కెరీర్లో ఫుల్ బిజీగా ఉన్న ఆయన… దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. అలాంటి స్టార్ హీరో సినిమాలో చిన్న పాత్ర అయినా దక్కితే చాలనే స్థాయిలో చాలా మంది నటులు ఎదురు చూస్తుంటారు.
కానీ ఆశ్చర్యంగా… ప్రభాస్ సినిమా ఛాన్స్ వచ్చినప్పటికీ ఒక యంగ్ హీరో మాత్రం దాన్ని రిజెక్ట్ చేశాడన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు?
ప్రస్తుతం విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో తిరువీర్… త్వరలో ‘పాపం ప్రతాప్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఆయన ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటపెట్టారు.
తనకు ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమాలో అవకాశం వచ్చిందని, అలాగే విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమాలో కూడా ఒక కీలక పాత్రకు ఆఫర్ వచ్చిందని తెలిపారు. కానీ ఈ రెండు అవకాశాలను కూడా తాను వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
దానికి కారణం డేట్స్ సమస్య. వరుస ప్రాజెక్ట్స్ వల్ల షూటింగ్ షెడ్యూల్స్‌ను మ్యాచ్ చేయడం కష్టమైందని ఆయన తెలిపారు. అంతేకాదు, ఒకేసారి వేర్వేరు సినిమాలు చేస్తే ప్రతి సినిమాలో లుక్ మార్చుకోవాల్సి ఉంటుంది. అది కూడా ప్రాక్టికల్‌గా చాలాచోట్ల ఇబ్బంది కలిగిస్తుందని చెప్పారు.
“నా కోసం స్టార్ హీరోల సినిమాలు ఆగవు. వాళ్లకు బడ్జెట్, ప్లానింగ్ అన్నీ ఫిక్స్‌గా ఉంటాయి. నా వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ అవకాశాలను వదులుకున్నాను” అని తిరువీర్ స్పష్టంగా చెప్పారు.
ఇలా ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా ఛాన్స్‌ను వదులుకోవడం చిన్న విషయం కాదు. కానీ సరైన కారణంతో తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. కొందరు ఆశ్చర్యపోతుండగా… మరికొందరు మాత్రం ఆయన ప్రొఫెషనల్ ఆలోచనను మెచ్చుకుంటున్నారు..









