బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రముఖ దర్శకుడు ఫర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తున్న ‘డాన్ 3’ సినిమా నుంచి చివరి నిమిషంలో రణ్వీర్ తప్పుకోవడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్’ (FWICE) తాజాగా ఆయనపై నిషేధం విధించినట్లు సమాచారం.
సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు ప్రాజెక్ట్‌ను వదిలేయడంపై వివరణ ఇవ్వాలని ఫెడరేషన్ నుంచి మూడుసార్లు నోటీసులు వెళ్లినా.. రణ్వీర్ సింగ్ స్పందించలేదని తెలుస్తోంది. దీంతో ఫెడరేషన్‌కు చెందిన దర్శకులు, కెమెరామెన్లు, లైట్మెన్లు, స్పాట్‌బాయ్స్ సహా కార్మికులు ఎవరూ ఆయన సినిమాలకు పని చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ నిషేధం రణ్వీర్ కెరీర్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవలే ఆయన నటించిన ‘ధురంధర్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ప్రస్తుతం రణ్వీర్ బాలీవుడ్లో మోస్ట్ డిమాండ్ ఉన్న స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. పెద్ద నిర్మాణ సంస్థలు ఫెడరేషన్ నిర్ణయాన్ని ఎంతవరకు సీరియస్‌గా తీసుకుంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరోవైపు.. ఇండస్ట్రీలో పెరుగుతున్న టికెట్ ధరలు, సినీ కార్మికుల జీతాల సమస్యలు, అలాగే సినిమాలపై ఏఐ ప్రభావం వంటి కీలక అంశాలపై ఫెడరేషన్ దృష్టి పెట్టాల్సిందని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.








