టాలీవుడ్లో ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న పేరు ఒక్కటే.. కింగ్ నాగార్జున – అనిల్ రావిపూడి కాంబో. చాలా కాలంగా ఈ కాంబినేషన్‌పై వార్తలు వస్తూనే ఉన్నప్పటికీ, అవన్నీ కేవలం రూమర్స్‌గానే మిగిలిపోయాయి. అయితే తాజాగా స్వయంగా అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు ఈ ప్రాజెక్ట్‌పై భారీ క్లారిటీ ఇచ్చాయి.
వరుస హిట్ చిత్రాలతో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన అనిల్ రావిపూడి ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు చేసి విజయాలను అందుకున్నారు. ఇప్పుడు నాగార్జునతో కూడా సినిమా చేస్తే, ఒకే తరం నలుగురు అగ్రహీరోలతో సినిమాలు తెరకెక్కించిన దర్శకుడిగా ఆయన అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నారు.
ఇటీవల ఓ షో ప్రమోషన్స్‌లో పాల్గొన్న సీనియర్ నటి రాధ, “నేను చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో కలిసి నటించాను” అని చెప్పగా, వెంటనే స్పందించిన అనిల్ రావిపూడి చిరంజీవి, బాలయ్య, వెంకటేష్‌లతో చేసిన తన సినిమాలను గుర్తు చేస్తూ, “నాగార్జునతో కూడా మనం త్వరలో సినిమా చేయబోతున్నాం” అని అన్నారు.
అనిల్ చేసిన ఈ ఒక్క కామెంట్‌తోనే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో నాగార్జున 101వ చిత్రంగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుందా? అనిల్ రావిపూడి తన ట్రేడ్‌మార్క్ కామెడీ, మాస్ ఎంటర్టైన్మెంట్తో నాగ్‌ను ఎలా చూపించబోతున్నారు? అనే చర్చలు అభిమానుల్లో జోరుగా సాగుతున్నాయి.
అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ సెన్సేషనల్ కాంబో మాత్రం ఇప్పటి నుంచే టాలీవుడ్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.








