మలయాళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిన్నల్ మురళి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ దర్శకుడు, త్వరలోనే టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బన్నీ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా, ఆ తరువాత లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో మరో ప్రాజెక్ట్ చేయనున్నట్లు సమాచారం. ఈ రెండు సినిమాల తరువాతే బాసిల్ జోసెఫ్‌తో మూవీ ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది.
చిరునవ్వుతో క్లారిటీ ఇచ్చిన బాసిల్…
ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఈ విషయంపై బాసిల్ జోసెఫ్‌ను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, ఆయన నేరుగా సమాధానం ఇవ్వకుండా కేవలం చిరునవ్వుతోనే దాటవేశారు. ఈ రియాక్షన్‌తో ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి పెరిగింది. ఆ చిరునవ్వు వెనుక నిజంగా ఏదో పెద్ద ప్రాజెక్ట్ దాగి ఉందని భావిస్తున్నారు.
‘రాకా’ షూటింగ్ చివరి దశలో…
ఒకవేళ ఈ ప్రాజెక్ట్ నిజం కాకపోతే వెంటనే క్లారిటీ ఇచ్చేవారని, కానీ అలా కాకుండా స్మైల్‌తో తప్పించుకోవడంతో ఈ కాంబో దాదాపు ఫిక్స్ అయిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న రాకా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవల విడుదలైన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
గ్లోబల్ టార్గెట్‌తో బన్నీ ప్లాన్స్…
ఈ సినిమా దాదాపు 80% పూర్తయిందని, ఆగస్ట్ నుంచి లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్‌లో బిజీ అవుతారని తెలుస్తోంది. ఇక తన సినిమాల విషయంలో అల్లు అర్జున్ కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. ప్రతి సినిమా షూటింగ్‌ను 200 రోజుల్లో పూర్తి చేయాలని కండిషన్ పెట్టినట్లు సమాచారం. దీంతో ప్రతి ఏడాది ఒక సినిమాను రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. ముఖ్యంగా బన్నీ చేసే ప్రతి ప్రాజెక్ట్ ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.









