తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది పెద్ది సినిమా చుట్టూ నడుస్తున్న ‘పర్సంటేజీ’ వివాదం. సంక్రాంతి సీజన్ తర్వాత టాలీవుడ్‌కు చెప్పుకోదగ్గ సాలిడ్ హిట్ లేకపోవడంతో.. ఇప్పుడు అందరి ఆశలు ఈ సినిమాపైనే ఉన్నాయి. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం జూన్ 4న విడుదలకు సిద్ధమవుతోంది. కానీ సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ.. థియేటర్ల పంచాయితీ కొత్త మలుపులు తిరుగుతోంది.
ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య మొదలైన ఈ వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో ‘మెగా వర్సెస్ దిల్ రాజు’ వార్‌లా మారిపోయిందనే చర్చ జోరుగా సాగుతోంది. సోషల్ మీడియాలో కూడా మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఎప్పుడూ లేని విధంగా.. సరిగ్గా ‘పెద్ది’ రిలీజ్ సమయంలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్య ఎందుకు తెరపైకి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.
గతంలో గేమ్ చేంజర్ సమయంలో నిర్మాత దిల్ రాజు కు రామ్ చరణ్ ఎంత పెద్ద సపోర్ట్ ఇచ్చారో ఇప్పుడు అభిమానులు గుర్తు చేస్తున్నారు. S. శంకర్ వంటి స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేయడం పెద్ద రిస్క్ అయినప్పటికీ.. దిల్ రాజుపై నమ్మకంతో చరణ్ ముందుకొచ్చారని, సినిమా ఫలితం ఎలా ఉన్నా తన రెమ్యూనరేషన్ విషయంలో కూడా రాజీ పడ్డారని చెబుతున్నారు. కానీ ఇప్పుడు దిల్ రాజు చేతిలో పెద్ద సినిమాలు లేకపోవడంతో.. ఎగ్జిబిటర్లను ముందుకు పెట్టి ‘పెద్ది’ సినిమాను టార్గెట్ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక మరోవైపు.. ఈ వివాదం వెనుక మైత్రి మూవీ మేకర్స్ మరియు దిల్ రాజు మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ కూడా కారణమనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. గత సంక్రాంతికి విడుదలైన మన శంకరా వరప్రసాద్ గారు సమయంలో ఇలాంటి థియేటర్ సమస్యలు ఏవీ రాలేదని, ఎందుకంటే ఆ సినిమాకు దిల్ రాజే డిస్ట్రిబ్యూటర్ అని అభిమానులు గుర్తుచేస్తున్నారు. కానీ ఇప్పుడు ‘పెద్ది’ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండటంతో కావాలనే సమస్యలు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఈ వివాదంపై నిర్మాత నట్టి కుమార్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, దిల్ రాజు మధ్య కోల్డ్ వార్ కారణంగానే మెగా హీరోల సినిమాలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు.. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కూడా అమలు కాకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయంటూ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే.. గతంలో ఒక ఇంటర్వ్యూలో శిరీష్ రామ్ చరణ్‌పై చేసిన ఇన్‌డైరెక్ట్ కామెంట్స్‌ను ఇప్పటికీ మెగా అభిమానులు మర్చిపోలేదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇప్పుడు ‘పెద్ది’ రిలీజ్ సమయంలో థియేటర్ల అంశాన్ని పెద్దదిగా చూపించడం కూడా అందులో భాగమేనని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
అయితే ఈ మొత్తం వివాదంపై దిల్ రాజు మాత్రం ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. మరోవైపు మెగా అభిమానులు మాత్రం.. ఎలాంటి అడ్డంకులు వచ్చినా జూన్ 4న ‘పెద్ది’ గ్రాండ్ రిలీజ్ ఖాయమని, రామ్ చరణ్ స్టామినా ముందు ఇవన్నీ పనిచేయవని సోషల్ మీడియాలో గట్టిగా చెబుతున్నారు. ఇక నిజంగా ఈ కోల్డ్ వార్ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపుతుందా లేదా అన్నది చూడాలి.








