టాలీవుడ్లో అనౌన్స్మెంట్తోనే భారీ అంచనాలు సృష్టించిన కార్తీ – కళ్యాణ్ శంకర్ కాంబినేషన్ మూవీ ఇప్పుడు అనుకోని వివాదంతో వార్తల్లో నిలిచింది. మ్యాడ్ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ శంకర్, ‘మ్యాడ్ స్క్వేర్’తో మరోసారి తన కామెడీ టైమింగ్‌ను ప్రూవ్ చేసుకున్నాడు. అలాంటి దర్శకుడితో తమిళ స్టార్ హీరో కార్తీ సినిమా చేయబోతున్నాడనే వార్త అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లక్కీ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గా ఎంపికైంది. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టింది. అంతా సవ్యంగా సాగుతోందని భావిస్తున్న సమయంలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి షాకింగ్ వార్తలు బయటకు వస్తున్నాయి.
ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం… ఈ సినిమా షూటింగ్ సగం పూర్తికాకముందే అనుకోని బ్రేక్ పడిందట. సాధారణంగా కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండే కార్తీ, ‘ఖైదీ’, ‘సర్దార్’, ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. యువ దర్శకులను ప్రోత్సహించడంలోనూ ఆయన ముందుంటారు. ఇదే నమ్మకంతో కళ్యాణ్ శంకర్ చెప్పిన ఎంటర్టైనింగ్ కథకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే ఇప్పటికే చిత్రీకరించిన సన్నివేశాల రషెస్‌ను చూడాలని కార్తీ కోరారట. ఎడిటింగ్ టేబుల్‌పై ఆ ఫుటేజ్ చూసిన తర్వాత ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనట్లు ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది.
కథ విన్నప్పుడు అనిపించిన మ్యాజిక్, తెరపై కనిపించడం లేదని కార్తీ భావించారట. ముఖ్యంగా టేకింగ్‌లో కొన్ని లోపాలు ఉన్నాయని సూచిస్తూ, కొన్ని కీలకమైన మార్పులు చేయాలని దర్శకుడికి సూచించినట్లు సమాచారం. ప్రస్తుత అవుట్‌పుట్‌తో సినిమా ముందుకు వెళ్తే ఆశించిన ఫలితం రాదని కూడా చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే తన రైటింగ్, టేకింగ్‌పై పూర్తి నమ్మకంతో ఉన్న కళ్యాణ్ శంకర్ మాత్రం హీరో సూచించిన మార్పులను అంగీకరించలేదని తెలుస్తోంది. దీంతో ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తాయని, అదే ఈ ప్రాజెక్ట్‌కు బ్రేక్ పడటానికి కారణమైందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ప్రస్తుతం ఈ సినిమా పూర్తిగా నిలిచిపోయిందని, త్వరలోనే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని ఫిలిం సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరోవైపు కార్తీ ఇప్పటికే తన తదుపరి కమిట్మెంట్స్పై దృష్టి పెట్టినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే ఈ క్రేజీ కాంబినేషన్ అటకెక్కిందా? లేక ఇవన్నీ కేవలం గాసిప్స్ మాత్రమేనా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే చిత్రబృందం స్పందించే వరకు వేచి చూడాల్సిందే.








