మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పెద్ది” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నప్పటికీ, అనుకున్న సమయానికి పూర్తి కాలేకపోవడంతో విడుదలపై సందేహాలు నెలకొన్నాయి. మొదట ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆ తేదీకి విడుదల కావడం కష్టమే అనిపిస్తోంది. ముఖ్యంగా ఇంకా స్పెషల్ సాంగ్ షూటింగ్ పూర్తి కాకపోవడం, అందులో నటించే హీరోయిన్ ఫైనల్ కాకపోవడం వల్ల ఆలస్యం మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమా జూన్‌లో విడుదలయ్యే అవకాశాలపై వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో జగపతిబాబు ‘అప్పలసూరి’ పాత్రలో కనిపించబోతుండగా, మరో సీనియర్ నటుడు సాయికుమార్ కూడా కీలక పాత్రలో భాగం కానున్నట్లు సమాచారం. ఇటీవల ఒక అభిమాని తీసుకున్న వీడియోలో సాయికుమార్ “పెద్ది” గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమా కోసం తాను కూడా అభిమానుల్లాగే ఎదురు చూస్తున్నానని, ఒక పాట షూటింగ్ మిగిలి ఉందని చెప్పారు. అలాగే రామ్ చరణ్ ప్రదర్శన గురించి ప్రశంసిస్తూ, “చరణ్ అదరగొట్టాడు” అని తెలిపారు.
అదే సమయంలో ఆయన “ఎవడు” సినిమాలోని ప్రసిద్ధ డైలాగ్‌ను చెప్పడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. “వాడి కంట్లో భయం లేదు.. ఒంట్లో బెదురు లేదు.. దెబ్బకు తిరుగులేదు ఎవడు.. వాడే రామ్ చరణ్” అంటూ చెప్పిన ఆ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు, స్పెషల్ సాంగ్ షూటింగ్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్లు నిర్వహించడానికి చాలా తక్కువ సమయం ఉండటంతో సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే రిలీజ్ డేట్‌పై వస్తున్న వార్తలపై చిత్ర బృందం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఇక దాదాపు పది సంవత్సరాల తర్వాత సాయికుమార్, రామ్ చరణ్ కలిసి స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








