టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నారనే వార్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. దశాబ్దాలుగా వెండితెరపై తన నటన, డ్యాన్స్, స్టైల్‌తో కోట్లాది అభిమానులను అలరించిన చిరంజీవి.. ఇప్పుడు తొలిసారి డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రతిష్టాత్మక పోడ్కాస్ట్ టాక్ షో ద్వారా ఆయన ప్రేక్షకులను పలకరించనున్నారనే టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మెగాస్టార్ జీవిత ప్రయాణం.. ఇప్పుడు పోడ్కాస్ట్ రూపంలో!
సాధారణ కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తన కష్టం, పట్టుదలతో తెలుగు చిత్రసీమను శాసించే స్థాయికి ఎదిగిన చిరంజీవి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తి. ఇప్పుడు అదే జర్నీని అభిమానులతో పంచుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నారని సమాచారం. కెరీర్ ప్రారంభ రోజుల్లో ఎదురైన కష్టాలు, తెరవెనుక జరిగిన ఆసక్తికర సంఘటనలు, విజయాల వెనుక ఉన్న నిజమైన కథలు ఈ షోలో ఉండబోతున్నాయని తెలుస్తోంది.
ఈ పోడ్కాస్ట్ను కేవలం ఎంటర్టైన్మెంట్కే పరిమితం కాకుండా.. రాబోయే తరాలకు ప్రేరణనిచ్చే విధంగా రూపొందించనున్నారట.
బి.వి.ఎస్. రవి ఎంట్రీతో పెరిగిన అంచనాలు
ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ రచయిత, దర్శకుడు బి.వి.ఎస్. రవి డిజైన్ చేస్తున్నారని సమాచారం. గతంలో బాలకృష్ణ హోస్ట్ చేసిన ‘అన్‌స్టాపబుల్’ షోకు ఆయన అందించిన రైటింగ్, కంటెంట్ ఎంతటి విజయాన్ని అందించిందో తెలిసిందే. ఇప్పుడు అదే బి.వి.ఎస్. రవి చిరంజీవి డిజిటల్ డెబ్యూ ప్రాజెక్ట్‌కు పనిచేస్తుండటంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి.
ఇక ఈ షో గురించి చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల కూడా గతంలో కొన్ని హింట్స్ ఇవ్వడం విశేషం. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్ తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. తాజాగా బి.వి.ఎస్. రవి కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్‌పై పరోక్షంగా క్లారిటీ ఇవ్వడం ఆసక్తిని రెట్టింపు చేసింది.
స్టార్ గెస్టులు ఉంటారా?
ఈ పోడ్కాస్ట్లో ఎవరు గెస్టులుగా పాల్గొంటారు? చిరంజీవితో కలిసి పనిచేసిన స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు, నటీనటులు ఇందులో కనిపిస్తారా? లేక ఆయన కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్ సినిమాలను ఆధారంగా చేసుకుని ప్రత్యేక ఎపిసోడ్లు రూపొందిస్తారా? అన్న అంశాలపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. వెండితెరపై ఎన్నో బాక్సాఫీస్ రికార్డులు సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు ఈ డిజిటల్ ఇన్నింగ్స్‌తో ఓటీటీ ప్రపంచంలో కూడా తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నారు.








