తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలను ఫిబ్రవరి 4న నిర్వహించనున్నారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ఆదివారం ప్రకటన జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు.. మంగళవారం 10 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది.
ఈ సమావేశంలో బీసీ సబ్ కమిటీ కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిటీ కమిషన్ నివేదికను కేబినెట్‌కు అందజేస్తారు. కులగణన, నివేదిక, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. మంత్రివర్గ సమావేశం అనంతరం 11 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి.
శాసనమండలి, అసెంబ్లీలో ఈ రెండు నివేదికలను ప్రవేశపెట్టి చర్చించనున్నారు. అయితే, ఈ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలంటూ ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆహ్వానించిన విషయం తెలిసిందే.
కేబినెట్ సబ్ కమిటీ చేతికి కులగణన నివేదిక
ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా రాష్ట్రంలో కులగణన అంశంపై మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందజేశారు. ఈ అంశంపై ఉత్తమ్ కుమార్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఈ సమావేశం అనంతరం మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, దామోదర రాజనర్సింహతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
వెనుకబడిన తరగతుల ప్రజలకు న్యాయం చేయాలనేదే తమ ఆకాంక్ష అని తెలిపారు. స్వాతంత్ర్యం ముందు నుంచీ మనదేశంలో జనగణన జరుగుతోందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కులగణన చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు.
బలహీన వర్గాల అభ్యున్నతికి అవసరమైన వివరాల సేకరణకు కులగణన చేపట్టామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. సామాజిక కులగణన సర్వేలో 1,03,889 మంది ఎన్యుమరేటర్లు పాల్గొన్నారని చెప్పారు. 96.9 శాతం (3.50 కోట్ల మంది) సర్వేలో పాల్గొని వివరాలు అందించారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. 3.1 శాతం మంది అంటే 16 లక్షల మంది వివిధ కారణాల వల్ల వివరాలు అందించలేదని వెల్లడించారు.
ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధి ఇతర అంశాలపై సమగ్ర అధ్యయనం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఏ వర్గం జనాభా ఎంత ఉందో ప్రభుత్వం దగ్గర డేటా ఉందని.. బీసీ జనాభా 46.25 శాతం ఉందని తెలిపారు. సామాజిక న్యాయం కోసమే సర్వే చేసినట్లు మంత్రి తెలిపారు.
సర్వేను అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించినా.. అధికారులు విజయవంతంగా పూర్తి చేశారన్నారు. ఫిబ్రవరి 4న మంత్రివర్గం ముందు కులగణన సర్వే నివేదికను ప్రవేశపెడతామన్నారు. కేబినెట్లో చర్చించి వెంటనే శాసనసభలో ప్రవేశపెడతామని తెలిపారు. సమాజంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి ఉత్తమ్ వివరించారు.









