మెగా బ్రదర్ నాగబాబుకు గుడ్ న్యూస్ అందించింది ఏపీ ప్రభుత్వం. ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఏపీ అసెంబ్లీ స్థానాలను అనుసరించి 25 మంది మంత్రులు అవాల్సి ఉండగా.. ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉన్నారు. మంత్రివర్గాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో.. పొత్తులో భాగంగా ఆ మిగిలిన స్థానాన్ని జనసేనకు కేటాయించింది కూటమి ప్రభుత్వం. కాగా ఆ స్థానానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రి వర్గంలో ఖరారు చేసినట్టు తెలుస్తోంది. రాజ్యసభ స్థానాల్లో జనసేనకు అవకాశం లేకపోవడంతోనే నాగబాబుకు మంత్రి పదవి దక్కిందని తెలుస్తోంది.
మెగా బ్రదర్ నాగబాబు గత ఎన్నికల్లో విసృతంగా పని చేసిన సంగతి తెలిసిందే.కూటమి అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా కష్టపడ్డారు. ఒకనొక సమయంలో ఆయన ఎంపీగా పోటీ చేయడానికి కూడా రెడీ అయ్యారు. అయితే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం, సీట్ల సర్దుబాటు విషయంలో నాగబాబు తన సీటును త్యాగం చేశారు. సీటు దక్కకపోయినప్పటికి నాగబాబు ఎటువంటి అసంతృప్తి వ్యక్తం చేయకుండా తమ్ముడు పవన్ స్థాపించిన జనసేన విజయం కోసం చెమటోడ్చారు.
అందరు భావించినట్టుగానే కూటమి అధికారంలోకి రావడంతో నాగబాబుకు కీలక పదవి దక్కుతుందని అంతా భావించారు. ఈ నేపథ్యంలో నాగబాబుకు కూడా కీలక పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది. నాగబాబును టీటీడీ చైర్మన్గా నియమించబోతున్నారన్నా ప్రచారం జరిగింది. అయితే ప్రచారానికి ఫుల్స్టాప్ పెడుతూ..టీవీ5 ఎండీ బీఆర్ నాయుడుకి టీటీడీ పదవి కట్టబెట్టారు చంద్రబాబు. ఇక తాజాగా ఏపీలో మూడు రాజ్యసభ పదవులు ఖాళీ అయ్యాయి. వైసీపీ నుంచి ఖాళీ చేసిన ముగ్గురు అభ్యర్ధుల స్థానాల భర్తీకి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. బీదా మాస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య, మోపిదేవి వెంకట రమణ వంటి వైసీపీ ఎంపీలు పార్టీతో పాటు, తమ పదవులకు రాజీనామా చేశారు.
దీంతో ఈ మూడు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో మెగా బ్రదర్ నాగబాబు రాజ్యసభకు వెళ్లడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఈ మూడు స్థానాల్లో బీద మస్తాన్, సానా సతీష్ , ఆర్. కృష్ణయ్య పేర్లను ఖారారు చేశారు. దీంతో మెగా బ్రదర్కు మరోసారి మొండిచేయి ఎదురైందని జనసేన కార్యకర్తలు భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా నాగబాబును మంత్రిగా ప్రకటించి చంద్రబాబు పెద్ద షాకే ఇచ్చారు. నాగబాబును ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవిలో కూర్చోబెట్టనున్నారు. మరో ఆరు నెలల్లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీల్లో ఒకటి నాగబాబుకు కేటాయించనున్నారు. నాగబాబు మంత్రి కానుండటంతో జనసేన కార్యకర్తల్లో ఆనందం నెలకొంది.దీంతో నాగబాబుకు ఏ శాఖ కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది.








