ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటి ఆసక్తిరేపుతోంది. ముఖ్యంగా రెండు రోజుల క్రితం కాకినాడ పోర్టులో పవన్ పర్యటనపై ప్రధానంగా చర్చజరిగింది. సోమవారం ఉండవల్లి నివాసంలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ లంచ్ మీటింగ్ జరిగింది. కాకినాడ పోర్ట్‌లో బియ్యం అక్రమ రవాణాపై చంద్రబాబుతో పవన్ బలంగా చెప్పినట్లు సమాచారం. ఈ విషయంలో ఏలా ముందుకెళ్లాలనే దానిపై బాబు పవన్‌ల మధ్య చర్చ కొనసాగింది.
రేషన్ బియ్యం వ్యాపారం విషయంలో ఇప్పటికే పవన్ ఓరేంజ్‌లో దూసుకెళ్లడం, కేంద్ర పెద్దల దృష్టికి విషయాన్ని తీసుకెళ్తానని చెప్పడంతో బియ్యం తరలింపు అంశం చర్చ కీలకంగా మారింది. మరోపక్క ఈ అంశంలో అక్కడ పోర్టు కార్మికులతో ముడిపడి ఉన్నందున, ఆచితూచి అడుగులేయాలని నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా ఇరువురు నేతలు చర్చించారు.
ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్ల వ్యవహారంపై కూడా చర్చ జరిగింది. బీజేపీ నుంచి ఆర్.కృష్ణయ్య, టీడీపీ నుంచి బీద మస్తాన్‌కు సీటు ఖారారైనట్లు తెలుస్తోంది. మరో సీటును జనసేనకు ఇవ్వడమా లేక టీడీపీ నుంచి మరొకరి ఛాన్స్ ఉందా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. జనసేన నుంచి నాగబాబు రాజ్యసభ సీటును ఆశిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో నాగబాబుకు రాజ్యసభ సీటు ఇస్తారా అనే దానిపై ఇంకా తేల్చలేదు. అదానీ అంశం కూడా చంద్రబాబు, పవన్ భేటీలో చర్చించడం తదుపరి నిర్ణయాలపైనా ఇద్దరు నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.దీంతోపాటు రాష్ట్రంలో, కేంద్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ఇరువురి నేతలు పలు అంశాలపై చర్చించుకున్నారు.