ఏపీ మంత్రివర్గం రతన్ టాటాకు నివాళి అర్పించింది. పలు కీలక అంశాలతో అజెండా పైన చర్చ లేకుండానే మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ముంబాయిలో రతన్ టాటాకు నివాళి అర్పించేందుకు ముంబాయి బయల్దేరారు. రతన్ టాటా మరణంతో మంత్రివర్గం లో నివాళి అర్పించిన తరువాత అజెండా పై చర్చను వాయిదా వేసారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించనుంది.
రతన్ టాటాకు నివాళి
రతన్ టాటా మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సంతాపం తెలిపారు. రతన్ టాటా మృతి నేపథ్యంలో ముంబై వెళ్లాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ కూడా వెళ్లనున్నారు. రతన్ టాటా పార్థివ దేహానికి ఇరువురు నివాళులు అర్పించనున్నారు. సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గ సమావేశంలో రతన్ టాటా కు నివాళి అర్పిస్తూ ముఖ్యమంత్రి తీర్మానం ప్రవేశ పెట్టారు. మంత్రివర్గం ఆమోదించిన తరువాత అధికారిక అజెండాను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ముంబాయికి చంద్రబాబు
ఆ తరువాత చంద్రబాబు, లోకేష్ ప్రత్యేక హెలికాఫ్టర్‌లో గన్నవరం వెళ్లనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ముంబైకి వెళ్లారు.రతన్ టాటా మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొందరు మాత్రమే తమ అడుగుజాడలు వెళుతూ వెళుతూ ఈ భూమిపై వదిలి వెళతారని, తమ దూరదృష్టి, సమగ్రతలతో రతన్ టాటా అదే చేశారని అన్నారు. మనం కేవలం ఒక గొప్ప వ్యాపారవేత్తనే కాదు గొప్ప మానవతావాదిని కోల్పోయామని, కేవలం పారిశ్రామిక వారసత్వంలోనే కాకుండా ఆయన అందరి హృదయాలను స్పృశించి వెళ్ళారన్నారు.
రతన్ టాటాకు మరణం లేదు
ఆయన పారిశ్రామిక రంగానికి చేసిన సేవ, జాతి నిర్మాణం లోనూ, పరోపకారి గుణంలోనూ తర తారాలలో మార్పును తెచ్చిందని కొనియాడారు. విలువలు, మానవత్వంతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన మహా దార్శనికుడు రతన్ టాటా అని మంత్రి లోకేష్ అన్నారు. దేశాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు, ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా టాటా గ్రూప్ సంస్థలను దశాబ్దాలుగా అదే నిబద్ధతతో నిర్వహించిన పద్మవిభూషణ్ రతన్ టాటా సేవలు చిరస్మరణీయమని అన్నారు. రతన్ టాటాకు మరణం లేదని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా జీవించే ఉంటారని అన్నారు.