ఎస్సీ వర్గీకరణపై కీలక ముందడుగు పడింది. ఇందుకు సంబంధించి కమిషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని ఆదేశించిన సీఎం.. ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాలన్నారు. ఆగస్ట్ లో ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ చేసేందుకు రాష్ట్రాలకు అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 మెజారిటీతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెల్లడించింది. దీంతో రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం వచ్చినట్లు అయింది. దీంతో ఆయా ఆయా రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేయాలని ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోంది. తెలంగాణలో కూడా ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది.
ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. సుప్రీం తీర్పుతో ఎస్సీ వర్గీకరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ వర్గీకరణ చేయకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తుందని ఆయన విమర్శించారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు నెలల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో.. వర్గీకరణకు రాష్ట్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైవు ఎస్సీ వర్గీకరణను మాల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.