తెలంగాణ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తొడలు కొట్టి సవాళ్లు చేసుకున్న సంచలన ఆరోపణలు చేసుకున్న రేవంత్ రెడ్డి మల్లారెడ్డి ఈరోజు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి మాజీ మంత్రి మల్లారెడ్డి రావడం ఆయనతో మాట్లాడడం ప్రస్తుతం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
సీఎం రేవంత్ ఇంటికి మల్లారెడ్డి
మాజీ మంత్రి మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి తన మనవరాలి పెళ్లి ఉందని పెళ్లి పత్రిక ఇచ్చి వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి వస్తున్న క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన కేవలం వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చేందుకే వచ్చానని స్పష్టం చేశారు. అంతే తప్ప మరే ఇతర కారణం లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి తేల్చి చెప్పారు.
మొన్న చంద్రబాబు, నేడు రేవంత్ రెడ్డిని కలిసిన మల్లారెడ్డి
ప్రస్తుతం మల్లారెడ్డి బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అయితే మల్లారెడ్డి ఇటీవల చంద్రబాబును కలిశారు. చంద్రబాబును మల్లారెడ్డి కలవడంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమయ్యాయి. తెలంగాణ టిడిపి అధ్యక్ష పదవిని మల్లారెడ్డికి ఇస్తారు అని కూడా ఊహాగానాలు వినిపించాయి .ఇదిలా కొనసాగుతూ ఉండగానే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి మల్లారెడ్డి వెళ్లడం ఆసక్తికర చర్చకు కారణమైంది.
రేవంత్ మల్లారెడ్డిని కలవటం వెనుక చర్చ
చంద్రబాబును మల్లారెడ్డి ఎందుకు కలిశారు?ప్రస్తుతం రేవంత్ రెడ్డిని మల్లారెడ్డి కలవడం వెనుక ఆంతర్యం ఏమిటి? నిజంగానే మల్లారెడ్డి తన మనవరాలు పెళ్ళికి ఆహ్వానించడానికి వెళ్లారా లేక ఏదైనా రాజకీయాలు మాట్లాడడానికి వెళ్లారా? ఇక కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మల్లారెడ్డి ప్రయత్నం చేస్తున్నారా? వంటి అనేక ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి.
మల్లారెడ్డిపై కేసులు, కాలేజీల కూల్చివేతలు
ఇక ఇప్పటికే మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కి సంబంధించిన కుత్బుల్లాపూర్ లో గల దుండిగల్ ఎం ఎల్ ఆర్ ఐ టి కాలేజీ భవనాలను అధికారులు కూల్చివేశారు .చిన్నదామర చెరువు ప్రాంతంలో కబ్జా చేసి అక్రమంగా నిర్మించాలని మల్లారెడ్డిపైన ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ చర్యలకు పాల్పడ్డారు. ఇక మరోవైపు అంతకుముందు ఒక భూమి వ్యవహారంలో కూడా మల్లారెడ్డిపైన బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఒకవైపు మల్లారెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన కాలేజీల కూల్చివేతలు, మరోవైపు మల్లారెడ్డి పై ఉన్న కేసుల నేపథ్యంలో తాజాగా మల్లారెడ్డి రేవంత్ రెడ్డి ని కలవడం ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు సవాళ్లు ప్రతి సవాళ్లు విసిరిన మల్లారెడ్డి ప్రస్తుతం రేవంత్ రెడ్డితో భేటీ కావడం తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామంగా సీనియర్ రాజకీయ నాయకులు భావిస్తున్నారు.
మల్లారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి
ఒకప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశారు. ఆ తర్వాత మల్లారెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఇదే సమయంలో రేవంత్ రెడ్డి మల్లారెడ్డి మధ్యలో ముఖ్యంగా భూ కబ్జాల గురించి ఇద్దరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.
తెలంగాణలో కీలక రాజకీయ పరిణామం
తొడలు కొట్టి మరీ సవాళ్లు విసురుకున్నారు ఇక తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి సీఎం కావడంతో పరిస్థితులన్నీ మారిపోయాయి. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ రెడ్డి ఇంటికి మల్లారెడ్డి రావడం రాజకీయంగా ప్రధానమైన అంశంగా మారింది.