Search
Close this search box.

  నాంపల్లి కోర్టుకు నాగార్జున, ఇతర కుటుంబ సభ్యులు… కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున స్టేట్‌మెంట్ రికార్డ్..

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అక్కినేని అమల, తనయుడు నాగచైతన్య, యార్లగడ్డ సుప్రియ తదితరులు నాంపల్లి కోర్టుకు వచ్చారు. నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద నాగార్జున కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో నాగార్జున స్టేట్‌మెంట్‌ను నాంపల్లి కోర్టు నేడు రికార్డ్ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.

 

కొండా సురేఖపై పిటిషన్ ఎందుకు దాఖలు చేశారని నాగార్జునను న్యాయస్థానం ప్రశ్నించింది. తన కుటుంబంతో పాటు నాగచైతన్య-సమంత విడాకుల అంశంపై మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని కోర్టుకు నాగార్జున తెలిపారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో తమ కుటుంబ పరువు, మర్యాదలకు భంగం వాటిల్లిందని ఆయన వాంగ్మూలం ఇచ్చారు.

 

రాజకీయ దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారని, అన్ని టీవీ ఛానళ్లలోనూ ఇది ప్రసారమైందని వెల్లడించారు. తమపై అసత్య ఆరోపణలు చేసిన ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వాంగ్మూలం సందర్భంగా కోరారు.

 

మంత్రి కొండా సురేఖ ఇటీవల రాజకీయ విమర్శల్లో భాగంగా నాగార్జున, నాగచైతన్య, సమంత పేర్లను ప్రస్తావించారు. కేటీఆర్ తో ముడిపెడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలపై తెలుగు సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, నాని తదితరులు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మరోవైపు, నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.

 

అంతకుముందు, మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి నాంపల్లి కోర్టుకు బయలుదేరారు. నాగార్జున రాక నేపథ్యంలో నాంపల్లి ప్రత్యేక కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు