ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి నుంచి పవన్ కల్యాణ్ ను వెంటనే డిస్ క్వాలీఫై చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పవన్ పై 14 సెక్షన్ల కింద గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ తరఫున ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం కేఏ పాల్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ పిచ్చికుక్క కరిసినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన మాటలు దేశంలో శాంతి, సామరస్యాలను దెబ్బ తీసేవిధంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. మొత్తం 14 సెక్షన్లను పవన్ కల్యాణ్ ఉల్లంఘించారని కేఏ పాల్ ఆరోపించారు. అయోధ్య రామాలయ కార్యక్రమానికి కల్తీ జరిగిన లక్షల లడ్డూలను పంపించారన్న ఆరోపణ తీవ్ర నేరమని ఆయన పేర్కొన్నారు. అయోధ్య కార్యక్రమం జరిగింది జనవరిలో అయితే కల్తీ విషయం బయటపడింది ఆయన డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న జులైలో అని కేఏ పాల్ అన్నారు. పంజాగుట్ట పోలీసులతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, సీబీఐలకు ఫిర్యాదు కాపీలను పంపనున్నట్లు కేఏ పాల్ తెలిపారు.
హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ హిందువులను కించపరిచారు. ఫిర్యాదులో 14 సెక్షన్లు పెట్టాను. ఆర్టికల్ 8 కింద పవన్ పై తక్షణమే అనర్హత వేటు వేసి డిప్యూటీ సీఎం పదవి ఆయనను తొలగించాలి. లేదా పవన్ కల్యాణే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలి. ఈ విషయమై పవన్ కల్యాణ్ ను అరెస్ట్ చేసి విచారణ చేయాలని కోరుతున్నాను. చట్టం ముందు అందరూ సమానేమే. పీఎం అయినా, సీఎం అయినా.. చట్టానికి కట్టుబడి ఉండాల్సిందే.
నేను హైదరాబాద్ లో ఉంటున్నా గత 40 ఏళ్ల నుంచి నేను ఏనాడు కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లలేదు. లడ్డూ వివాదం విషయమై ఇష్టానుసారంగా మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ నోరును మూయించాలి. పవన్ కల్యాణ్ ఏది పడితే అది మాట్లాడుతున్నాడు.. ఇదే విషయాన్ని నేను ఎప్పుడో చెప్పాను. అయినా నన్నెవరూ పట్టించుకోలేదు. పవన్ కల్యాణ్ మాట్లాడేవన్నీ రాంగ్. సినిమాలో మాదిరి నీకు ఎవరు స్క్రిప్ట్ ఇస్తే అది చదువొద్దు పవన్. అలా చేస్తే చట్ట విరుద్ధమవుతుంది. ఇది తెలుసుకో ముందు పవన్.
ఈ విషయంలో నాకు న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అన్ని ఆధారాలతో నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. 145 కోట్ల మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీశారు. ముఖఅయంగా 100 కోట్ల మంది హైందవులు మనోభావులను దెబ్బతీశారు. లడ్డూలో కల్తీ జరిగిందంటూ ఆధారాలు లేకుండా వివాదం సృష్టించారు. దీంతో భక్తుల మనోభావాలతో ఆడుకున్నట్టే. స్వామి వివేకానందను మిస్ లీడ్ చేసే విధంగా పవన్ మాట్లాడారు. పవన్ తానే స్వయంగా చెప్పారు.. తాను క్రిస్టియన్ అని. కానీ, ఇప్పుడేమో సనాతన ధర్మం అంటున్నారు. అసలేందో అర్థం అవ్వట్లేదు. ఈ క్రమంలో వెంటనే పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలి’ అంటూ కేఏ పాల్ వ్యాఖ్యానించారు.