ఇప్పటికే పూర్తయిన జమ్మూ-కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇవాళ జరుగుతున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై ఇవాళ సాయంత్రం పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. జాతీయ స్దాయిలో పలు మీడియా సంస్థలతో పాటు వివిధ ఏజెన్సీలు, సర్వే సంస్థలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే గతంలో ఏయే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ వాస్తవ ఫలితాలను ప్రతిబింబించాయన్న అంశాన్ని ఓసారి తెలుసుకుందాం..
ఇదే హర్యానాలో పదేళ్ల క్రితం అంటే 2024లో చాలా మటుకు సర్వే సంస్థలు కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. కానీ అనూహ్యంగా బీజేపీ అధికారం చేపట్టింది. అప్పట్లో బీజేపీ గెలిచి అధికారం చేపట్టబోతోందని న్యూస్ 24-చాణక్య, ఏబీపీ న్యూస్-నీల్సన్ మాత్రమే అంచనా వేశాయి. టైమ్స్ నౌ ఇండియా, ఇండియా టీవీ-సీఓటర్ మాత్రం కాంగ్రెస్ గెలిచే సీట్లను కచ్చితంగా అంచనావేశాయి.
2019లో చూసుకుంటే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు బీజేపీ ఇదే హర్యానాలో 70 సీట్లకు పైగా గెలిచి అధికారం చేపడుతుందని అంచనా వేశాయి. కానీ అక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఇండియాటుడే-మై యాక్సెస్ మాత్రం బీజేపీ 32-44 సీట్లు గెల్చుకుని అధికారం ముంగిట నిలిచిపోతుందని అంచనా వేసింది. అలాగే కాంగెస్ 30-42 సీట్లు సాధిస్తుందని కూడా చెప్పింది.
జమ్మూ కాశ్మీర్ విషయానికొస్తే 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ అత్యధిక సీట్లు సాధిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. పీడీపీకి 32-38 సీట్లు వస్తాయని, బీజేపీకి 27-33 సీట్లు వస్తాయని, ఎన్సీకి 8-14, కాంగ్రెస్ కు 4-10 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. ఇవన్నీ తప్పాయి. పీడీపీ 28 సీట్లు, బీజేపీ 25 సీట్లు సాధించాయి. ఎన్సీ 15, కాంగ్రెస్ 12 సీట్లు దక్కించుకున్నాయి. పీడీపీ-బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి.