ఏపీలో తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో నిన్న తిరుపతిలో వారాహి సభ పెట్టి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన విమర్శల్ని పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల తప్పుబట్టారు. అధికారం వచ్చాక పవన్ వేషం, భాష మారిపోయిందన్నారు. ఉన్నత హోదాలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ అన్ని వర్గాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని, అన్ని మతాల్ని సమానంగా చూడాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ఒక మతమే ముఖ్యం అన్నట్లుగా పవన్ మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.
డిప్యూటీ సీఎంగా ఒక మతానికి చెందిన బట్టలు వేసుకుని డ్యూటీ చేస్తుంటే మిగతా మతాలకు అభద్రతా భావం కలగదా అని షర్మిల ప్రశ్నించారు. జనసేన సెక్యులర్ పార్టీ అనుకునే వాళ్లమని, కానీ ఇప్పుడు రైటిస్ట్ పార్టీ అని అర్థమవుతోందన్నారు
ఆరెస్సెస్ సిద్దాంతాన్ని బీజేపీ అనుసరిస్తుందని, మీరు కూడా అనుసరిస్తున్నారా అని షర్మిల పవన్ ను ప్రశ్నించారు. మణిపూర్ లో బీజేపీ క్రైస్తవుల ఊచకోత చేస్తే పవన్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. మిగతా మతాలు అక్కర్లేదనుకుని పవన్ మాట్లాడుతున్నారన్నారు.
మీరా రాహుల్ గాంధీపై మాట్లాడేది అని పవన్ ను షర్మిల ప్రశ్నించారు. రాహుల్ గాంధీ దేశ ప్రజల్లో ఐక్యత, సోదరభావం పెంపొందించడానికి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ భారత్ జోడో యాత్ర చేసారని, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడి పవన్ తన స్దాయి దిగజార్చుకున్నారని షర్మిల విమర్శించారు. మరోవైపు తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు షర్మిల తెలిపారు. సీబీఐతో స్వతంత్ర దర్యాప్తు చేయించాలని ముందుగా కోరింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. దేవుడి దయతో సుప్రీంకోర్టు కూడా అదే తీర్పు ఇచ్చిందన్నారు. అలాగే సుప్రీంకోర్టు చెప్పినట్లుగా దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు.