Search
Close this search box.

  కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా..

బీఆర్ఎస్ అధినేత కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో ప్రముఖ సినీనటులు నాగార్జున, సమంత, నాగచైతన్యపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై నలువైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. కొండా సురేఖ వ్యాఖ్యలను ఇప్పటికే నాగార్జున ఖండించారు. అసత్య ఆరోపణలు చేయడం సరికాదంటూ మండిపడ్డారు.

 

తాజాగా, మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ హైదరాబాద్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కాగా, ఇప్పటికే కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జునతోపాటు అమల, నాగచైతన్య, సమంత తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఉన్నత స్థానంలో ఉండి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు, సినీ ప్రముఖులు కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.

 

‘గౌరవనీయ మంత్రివర్యులు కొండా సురేఖ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’ అని నాగార్జున బుధవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

 

సమంత కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘మహిళగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి.. చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారూ..ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను. దయచేసి చిన్నచూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను’ అని సమంత తన ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నారు.

 

అంతేగాక, ‘వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచండి. నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంచగలరా?. అలానే ఉండాలని కోరుకుంటున్నాను’ అని సమంత ఆ పోస్టులో స్పష్టం చేశారు.

 

అక్కినేని అమల కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. ‘ఒక మహిళా మంత్రి (కొండాసురేఖ) కల్పిత ఆరోపణలు చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం దిగ్భ్రాంతికరం. నా భర్త (అక్కినేని నాగార్జున) గురించి తప్పుడు కథనాలు చెబుతున్న ఇలాంటి వ్యక్తులను నమ్ముతున్నారా? ఇది నిజంగా సిగ్గుచేటు. నేతలు ఇంతలా దిగజారి ప్రవర్తిస్తే మన దేశం ఏమవుతుంది. రాహుల్ గాంధీ.. మీరు వ్యక్తుల గౌరవమర్యాదలను నమ్మినట్లయితే.. దయచేసి మీ నేతలను అదుపులో ఉంచుకోండి. ఆ మహిళా మంత్రి నా కుటుంబానికి చెప్పి, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోండి. ఈ దేశ పౌరులను రక్షించండి’ అని అక్కినేని అమల తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.

 

మరోవైపు, అక్కినేని నాగచైతన్య కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు. ‘మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని.. మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను’ అని ఎక్స్ వేదికగా నాగచైతన్య పేర్కొన్నారు.

 

కొండా సురేఖ ఏమన్నారంటే.?

 

తనపై సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో, ఫొటోలతో ట్రోల్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. ఈ క్రమంలోనే నాగచైతన్య, సమంతల విడాకులకు కేటీఆరే కారణమని కొండా సురేఖ ఆరోపించారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసింది కేటీఆర్ కాదా? అని ప్రశ్నించారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంది కేటీఆర్ అని అన్నారు. మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్ అని ఆరోపించారు. అంతేగాక, ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ఆపాలంటే సమంతను తన వద్దకు పంపాలని కేటీఆర్ కోరారని.. దీంతో నాగార్జున, నాగచైతన్య.. సమంతపై ఒత్తిడి తెచ్చారని కొండా సురేఖ ఆరోపించారు. సమంత అందుకు ఒప్పుకోలేదని చెప్పారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు