ఏపీలో తీవ్ర సంచలనం రేపిన తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సమగ్ర విచారణ కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో విచారణ జరగకుండా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేసిన బహిరంగ ప్రకటనల్ని గత విచారణలో సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అంతే కాదు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జరుగుతున్న సిట్ దర్యాప్తుపైనా కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్దమైంది.
ఈ మేరకు తిరుమల లడ్డూ పిటిషన్లపై విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. అయితే ఇవాళ సొలిసిటర్ జనరల్ తిరుమల లడ్డూ కల్తీపై సిట్ దర్యాప్తు సరిపోతుందా లేక కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐకి కేసు అప్పగించాలా అన్న దానిపై సుప్రీంకోర్టుకు అభిప్రాయం చెప్పాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణకు సిద్ధమైన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఇతర కేసుల బిజీ కారణంగా విచారణను రేపు ఉదయానికి వాయిదా వేసింది.
రేపు ఉదయం పదిన్నర గంటలకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అభిప్రాయాన్ని తెలియజేయాలని, దాని ఆధారంగా తిరుమల లడ్డూ కల్తీ అంశంపై సిట్ దర్యాప్తా లేక సీబీఐ దర్యాప్తా అన్నది తేలుస్తామని ప్రకటించింది. దీంతో రేపు జరిగే విచారణ కీలకంగా మారింది. ఇప్పటికే కేంద్రం అభిప్రాయం తీసుకున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు నివేదిస్తారు. దీని ఆధారంగా రేపు సుప్రీంకోర్టు తన నిర్ణయం ప్రకటించనుంది.