Search
Close this search box.

  మళ్లీ సమ్మె బాట పట్టిన బెంగాల్ వైద్యులు..!

కోల్ కతాలో ట్రెయినీ డాక్టర్ అత్యాచారం ఘటన తర్వాత ఆందోళన చేపట్టిన జూనియర్ డాక్టర్లు వారం కిందట తాత్కాలికంగా నిరసన విరమించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హామీతో నిరసన విరమించిన వైద్యులు.. తాజాగా మళ్లీ ఆందోళన బాట పట్టారు. మంగళవారం నుంచే విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఆసుపత్రులలో తమకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. సాగోర్ దత్తా మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో ఓ వైద్యుడిపై దాడి జరగడంతో ఆందోళన చేపట్టారు. ఈసారి ఆందోళనను మరింత తీవ్రంగా చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అత్యవసర సేవలు సహా అన్ని సేవలకు దూరంగా ఉండనున్నట్లు వెల్లడించారు.

 

ఆర్జీ కర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం నేపథ్యంలో పనిచేసే చోట తమకు రక్షణ లేకుండా పోయిందని వైద్యులు వాపోతున్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు మహిళా వైద్యుల భద్రత, డాక్టర్లపై దాడులను అరికట్టేందుకు రక్షణ ఏర్పాట్ల కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆందోళన చేపట్టిన వైద్యులతో అప్పట్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చర్చలు జరిపారు. ఆసుపత్రులలో మహిళా వైద్యుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, ఆసుపత్రులలో సీసీటీవీ కెమెరాల ఏర్పాట్లు తదితర ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

 

దీంతో వైద్యులు ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు. అయితే, తాజాగా సాగోర్ దత్తా ఆసుపత్రిలో వైద్యుడిపై దాడి జరగడంతో మళ్లీ ఆందోళన చేపట్టారు. బుధవారం (అక్టోబర్ 2) భారీ నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించారు. చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమకు ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని వైద్యులు ఆరోపించారు. దీంతో విధులను బహిష్కరించడం మినహా తమకు మరో మార్గంలేకుండా పోయిందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆసుపత్రులలో వైద్యుల రక్షణకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు