దేశంలో ఒకవంక దసరా పండగ కోలాహలం నెలకొంటోంది. రెండ్రోజుల్లో దేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ఆరంభం కానున్నాయి. అన్ని రాష్ట్రాలు పండగ శోభను సంతరించుకుంటోన్నాయి. అమ్మవారి ఆలయాలన్నీ ముస్తాబవుతున్నాయి.
ఈ పరిస్థితుల మధ్య వంటగ్యాస్ వినియోగదారులపై పెనుభారం పడింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో సిలిండర్‌పై అదనంగా 50 రూపాయలను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెంచిన ధరలు ఈ తెల్లవారు జాము నుంచే అమలులోకి వచ్చాయి.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే చమురు కంపెనీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. తాజా పెంపుతో దేశ రాజధానిలో ఒక్కో వాణిజ్య సిలిండర్ రేటు 1,740 రూపాయలకు పెరిగింది. కోల్‌కత- రూ.1,850.50 పైసలు, ముంబై- రూ.1,694, చెన్నై- 1,903 రూపాయలు పలుకుతోంది.
నెల రోజుల వ్యవధిలో కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం వరుసగా ఇది మూడోసారి. కిందటి నెల కూడా వాటి రేట్లను పెంచాయి చమురు కంపెనీలు. ఒక్కో సిలిండర్ మీద రూ.8.50 పైసలు, సెప్టెంబర్ 1వ తేదీన 39 రూపాయల మేర భారాన్ని మోపాయి. ఇప్పుడు మళ్లీ 50 రూపాయలు చొప్పున పెంచాయి.
అంతకంటే ముందు మే, జూన్, జులై నెలల్లో వాటి రేట్లను కొంతమేర తగ్గించిన విషయం తెలిసిందే. మే నెలలో 19 రూపాయలు, జూన్‌లో రూ.69.50 పైసలు, జులైలో 30 రూపాయల మేర తగ్గించాయి. కమర్షియల్ వంటగ్యాస్ వినియోగదారులకు ఊరట కల్పించాయి. ఇప్పుడు మళ్లీ వాటి రేట్లను 39 రూపాయల వరకు పెంచాయి.
గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ కనెక్షన్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. వాటి రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి. ఒక్కో సిలిండర్ ధర 803 రూపాయలు. ఇదివరకు కేంద్ర ప్రభుత్వం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పంపిణీ చేసే గృహావసర వంటగ్యాస్ కనెక్షన్ల ధరలో సబ్సిడీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కో గ్యాస్ కనెక్షన్‌పై 200 రూపాయల సబ్సిడీని ఇచ్చింది.