Search
Close this search box.

  ఫ్యామిలీ విభేదాలా..? బొత్సకు తమ్ముడు ఝలక్, జనసేనలోకి అడుగులు..

వైసీపీలో ఏం జరుగుతోంది? ఆ పార్టీ పనైపోయిందా? నేతలు తట్టా బుట్టా సర్దుకుంటున్నారా? నేతలు ఎందుకు బయటకు వస్తున్నారా? అంతర్గత కలహాలు కారణమా? రోజుకో నేత ఫ్యాన్ పార్టీకి ఎందుకు గుడ్ బై చెప్పేస్తున్నారు? తాజాగా బొత్స సొదరుడు జనసేన‌లోకి వెళ్లేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

 

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత నేతలు వలస పోతున్నారు. నేతలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాల్సిన అధినేత బెంగుళూరులో మకాం పెట్టడంతో చెదిరిపోతున్నారు. పైగా నాయకుడు అనేవాడు ప్రజల్లో నుంచి రావాలన్న జగన్ మాట.. నేతలను ఎక్కడో గుచ్చుకుంది. దీంతో ఫ్యాన్ పార్టీ నుంచి వలసలు కంటిన్యూ అవుతున్నాయి.

 

ఈ జాబితాలో మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ, సోదరుడితో ఉంటే లైఫ్ ఉండదని భావించారో ఏమో తెలీదుగానీ, ఫ్యాన్ పార్టీకి దూరం కావాలని నిర్ణయించుకున్నారు. అక్టోబరు మూడున జనసేన పార్టీలోకి చేరాలని నిర్ణయించుకున్నాడు.

 

2019 ఎన్నికల్లో వైసీపీ విజయనగరం జిల్లా క్లీన్ స్వీప్ చేయడానికి బొత్స సత్తిబాబు ఫ్యామిలీ ఎంతో కృషి చేసింది. తమ్ముడు అప్పలనరసయ్య, లక్ష్మణరావు మేనల్లుడు చిన్న శ్రీను ఎవరి ప్రయత్నాలు వారు చేశారు సక్సెస్ అయ్యారు. బొత్స మంత్రి కాగా, అప్పల నర్సయ్య ఎమ్మెల్యే అయ్యాడు, మేనల్లుడు జెడ్పీ ఛైర్మన్ అయ్యారు.

 

2024 ఎన్నికల తర్వాత పార్టీలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. బొత్స ఫ్యామిలీలో అంతర్గత చిచ్చు మొదలైంది. దీంతో ఎన్నికల ముందు బొత్స లక్ష్మణరావు నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం మాధవి సపోర్టు చేయడం, ఆమె గెలవడం జరిగిపోయింది. ఆ తర్వాత నేరుగా ఎమ్మెల్యేను వెళ్లి కలిశారు. రాజకీయాలపై చర్చించారు.

 

జనసేనలోకి చేరాలని నిర్ణయించుకున్నట్లు ఎమ్మెల్యేతో లక్ష్మణరావు వెల్లడించారు. ఇప్పుడు చేరితే వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలనే ఆలోచన ఆయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట.

 

విజయనగరం జిల్లాలో పొలిటికల్ టాక్ మరో విధంగా ఉంది. వైసీపీలో కష్టమని భావించి కావాలనే బొత్స సత్తిబాబు తన తమ్ముడ్ని జనసేనలోకి పంపిస్తున్నారని అంటున్నారు. కొద్దిరోజులుగా ఆ జిల్లాలో నేతలు సైతం ఇదే విధంగా చర్చించుకుంటున్నారట. రాబోయే రోజుల్లో ఆ పార్టీ నుంచి ఇంకెంతమంది నేతలు మిగతా పార్టీల వైపు వెళ్తారో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు