తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగం తెలంగాణ ప్రభుత్వం తమను ఆదుకోవడానికి తమకు భరోసా ఇవ్వడానికి అమలు చేసే పథకాల కోసం ఎదురుచూస్తోంది. ఆరుగాలం శ్రమించి వ్యవసాయం చేస్తున్నా అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి విపత్తులతో రైతన్నలు నష్టపోతూనే ఉన్నారు. అటువంటి రైతులను నష్టాలనుండి బయటకు తీసుకురావడానికి వారి జీవితాలకు భరోసా కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని పేర్కొంది.
తెలంగాణలో రైతు బంధు స్థానంలో రైతు భరోసా
కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల హామీలో రైతుభరోసా పథకంపైన అన్నదాతలకు హామీ ఇచ్చింది. అన్నదాతలు తమ పంటలను సాగు చేసుకునేందుకుగాను ఎకరాకు పదిహేను వేలరూపాయలు చొప్పున వారికి పెట్టుబడి సాయం అందిస్తామని ఖరీఫ్, రబీ సీజన్లో సీజన్ కు 7500 చొప్పున రెండు విడతల్లో ఈ నిధులు అందిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం స్థానంలో ప్రస్తుత ప్రభుత్వం రైతుభరోసా పథకాన్ని అమలు చేయడానికి సంకల్పించింది.
ఇప్పటికే తెలంగాణలో రైతు రుణమాఫీ అందించిన ప్రభుత్వం
అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసింది. మూడు విడతల్లో అన్నదాతల ఖాతాలలోకి మొత్తం 31 వేల కోట్ల నిధులను జమ చేసింది. అయితే రైతు రుణమాఫీ విషయంలో ఇంకా అనేక జిల్లాలలో రుణమాఫీ రాని రైతులు ఇబ్బందులు పడుతుంటే వారి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
రైతు భారోసాకు ముహూర్తం ఫిక్స్
ఇదిలా కొనసాగుతుండగానే ప్రస్తుతం అన్నదాతలకు మరో శుభవార్తను చెప్పడానికి రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముహూర్తాన్ని సిద్ధం చేసింది. అక్టోబర్ 12వ తేదీన అంటే దసరా రోజున రైతు భరోసా పథకాన్ని ప్రారంభించినట్టు తెలుస్తుంది. దసరా నడు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 7500 రైతుల ఖాతాలలో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం.
రేపు తెలంగాణా క్యాబినెట్ భేటీలో ఆమోద ముద్ర
ఈ క్రమంలో రేపు తెలంగాణ క్యాబినెట్ సమావేశమై రైతు భరోసా పథకం అమలకు ఆమోదముద్ర వేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆ తర్వాత దీని విధివిధానాలను ఖరారు చేసి రైతు భరోసా పథకాన్ని ప్రకటించనున్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1.53 కోట్ల ఎకరాలకు 11,475 కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం ఖర్చవుతుందని ఒక అంచనా ఉంది.
రైతు భరోసా పథకంపై ఆసక్తి
అయితే ఇటీవల కేవలం సాగులో ఉన్న భూములకే రైతు భరోసా పథకం అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడంతో రైతు భరోసా పథకంలో పెట్టుబడి సాయం ఎవరికి వస్తుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. గతంలో సాగులో లేని భూములకు కూడా రైతు బంధు వచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా విషయంలో ఏం చెయ్యబోతుందో త్వరలోనే తెలుస్తుంది.