పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండెం దొరబాబు పార్టీ వీడనున్నారు. ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే పెండెం దొరబాబు వైసీపీకీ దూరంగా ఉంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్టు ఆశించి భంగపడ్డ వారిలో దొరబాబు ఉన్నారు. పిఠాపురం నుండి అనూహ్యంగా వంగా గీతను పవన్ కళ్యాణ్‌పై పోటీకి దింపారు. దీంతో అప్పటి వరకూ పిఠాపురం టిక్కెట్టు తనదేనని చెప్పిన దొరబాబు భంగపాటుకు గురయ్యారు.
కొద్దికాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఎన్నికల సమయం కావడంతో వైసీపీ దొరబాబును బుజ్జిగించే ప్రయత్నాలు చేసింది. చివరకు వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఆశచూపింది. అయితే అది కూడా ఇవ్వకపోవడంతో దొరబాబును పార్టీయే పూర్తిగా పక్కన పెట్టేయడంతో ఆయన ఎన్నికల్లో ఉత్సాహంగా ప్రచారం చేయలేదని క్యాడర్ అంటున్నారు. పైగా ఆయన అనుచర వర్గం కూడా పరోక్షంగా కూటమి అభ్యర్థి పవన్‌కు మద్ధతివ్వడంతో దొరబాబుకు-వైసీపీకీ దూరం బాగా పెరిగింది. వైసీపీ అభ్యర్థిగా ఉన్న వంగా గీత కూడా దొరబాబు సహకారాన్ని కోరకపోవడంతో ఆయన ఒంటరి వాడయ్యారు.
ఈనేపథ్యంలో ఎన్నికల వరకూ వేచి చూసిన దొరబాబు, ఆతర్వాతైనా పిఠాపురం నియోజవకర్గ వైసీపీ ఇన్‌చార్జి పదవి ఇస్తారని కూడా ఆశించారు. దానిపైనా ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా, వైసీపీ దొరబాబును పూర్తిగా పక్కన పెట్టేయడంతో ఆయన రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కొంత మంది వైసీపీ పెద్దల వద్ధ ప్రస్తావించి, గౌరవం లేని చోట ఉండటం దేనికంటూ దొరబాబు మనసులో మాట చెప్పాశారని ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో పిఠాపురంలో ఆయన కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. జరిగిన విషయాలను ప్రస్తావించి, వైసీపీకి రాజీనామా చేస్తారని అంటున్నారు.
జనసేనలోకి..
ఇదిలా ఉంటే పెండెం దొరబాబు జనసేనలోకి వెళుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈనెల 10 వ తేదిన గాని, ఆతర్వాత గాని ఆయన జనసేన తీర్థం పుచ్చుకుంటాని ఆయన అనుచరవర్గం బలంగా చెబుతోంది. దొరబాబు అల్లుడు, పవన్‌కు ఉన్న సత్ససంబంధాలు దొరబాబుకు జనసేనలోకి అవకాశం కల్పిస్తున్నాయని అంటున్నారు. మొత్తంగా చూస్తే పెండెం దొరబాబు రాజకీయంగా కొత్త దారులు వెతుకుతున్నట్లు తెలుస్తోంది.