Search
Close this search box.

  త్వరలో ఉక్రెయిన్‌కు ప్రధాని మోదీ..!

భారత ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన ఖరారైనట్టు తెలుస్తోంది. ఆగస్టులో ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నెల క్రితం ఇటలీలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కలుసుకున్నారు. ఇటీవలి మోదీ రష్యా పర్యటనపై జెలెన్‌స్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని ఓ పిల్లల ఆసుపత్రిపై రష్యా మిసైల్ దాడి జరిగిన రోజునే మోదీ, పుతిన్‌లు సమావేశమయ్యారంటూ జెలెన్‌స్కీ అప్పట్లో మండిపడ్డారు. ఇది చాలా నిరాశపరిచే పరిణామమని, శాంతి స్థాపన కసరత్తుకు గొడ్డలి పెట్టు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మోదీ ఉక్రెయిన్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

అంతకుముందు ప్రధాని మోదీ ఎన్నికల విజయంపై శుభాకాంక్షలు తెలిపిన జెలెన్‌స్కీ తమ దేశంలో పర్యటించాలని ఆయనను ఆహ్వానించారు. మార్చిలో మోదీతో ఫోన్ కాల్ సందర్భంగా కూడా ఆయన ఇరు దేశాల దౌత్యబంధం బలోపేతం చేసే చర్యలపై చర్చించారు. చర్చలు, దౌత్యం ద్వారానే రష్యాతో యుద్ధానికి ముగింపు పలకాలని ఆకాంక్షించారు. సమస్యకు సామరస్య పరిష్కారం కోసం తాను చేయగలిగినంతా చేస్తానని మోదీ అప్పట్లోనే మాటిచ్చారు.

కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచీ ఈ సమస్యకు చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని భారత్ చెబుతూ వస్తోంది. శాంతి స్థాపన కోసం తమవంతు బాధ్యత నిర్వర్తిస్తామని మోదీ అన్నారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం సందర్భంగా ప్రధాని ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. యుద్ధ రంగంలో ఏ సమస్యకూ పరిష్కారం లభించదని వ్యాఖ్యానించారు. యూనైటెడ్ నేషన్స్ చార్టర్‌ను, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాల్ని గౌరవించాలన్నదే భారత్ అభిమతమని చెప్పారు. చర్చలు, దౌత్యమే మన ముందున్న ఏకైక మార్గమని తేల్చి చెప్పారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు