కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతూ చేసిన బడ్జెట్ ప్రసంగంపై విమర్శలు వచ్చాయి. ఆమె తన పూర్తి ప్రసంగంలో తమ రాష్ట్రం పేరును నామమాత్రంగానైనా ప్రస్తావించలేదని తెలంగాణ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రెండు రాష్ట్రాలకు దండిగా నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపిందని ఫైర్ అవుతున్నారు. తెలంగాణ ప్రజలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను లోక్ సభకు పంపిస్తే కనీసం ఎనిమిది రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పునర్విభజన చట్టాన్ని పలుమార్లు ప్రస్తావించి ఏపీకి నిధులు ప్రకటించిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్.. అదే పునర్విభజన చట్టం వర్తించే తెలంగాణ పేరును ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని, నిధులనూ కేటాయించలేదని సీరియస్ అయ్యారు. ఇది తెలంగాణ పట్ల వివక్ష కాదని, కచ్చితంగా కక్షే అని సీఎం ఆగ్రహించారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో మొండిచేయి చూపిందని, అన్యాయంగా వ్యవహరించిందని ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ రోజు రాజ్యసభలో ప్రసంగిస్తూ ఈ ప్రశ్నలపై స్పందించారు. కేంద్ర బడ్జెట్ వివక్షాపూరితంగా ఉన్నదంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. ప్రతిపక్షాలు దారుణమైన ఆరోపణలు చేస్తున్నాయని, బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రం పేరు ప్రస్తావించనంత మాత్రానా అసలు ఏ పథకాలు, నిధులూ మంజూరు చేయలేదని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆగ్రహించారు.
విపక్షాలు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని నిర్మల సీతారామన్ ఖండించారు. బడ్జెట్ ప్రసంగంలో చాలా రాష్ట్రాల పేర్లు ప్రస్తావించలేదని, కేవలం రెండు రాష్ట్రాల పేర్లే ప్రస్తావించానని ఖర్గే తనపై ఆరోపణలు చేశారని నిర్మల గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో చాలా కాలం అధికారంలో ఉన్నదని, దేశాన్ని పాలించిందని, అదే క్రమంలో చాలా బడ్జెట్‌లనూ ప్రవేశపెట్టిందని వివరించారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బడ్జెట్‌లో ప్రతి రాష్ట్రం పేరును ప్రస్తావించిందా? అని ఎదురు ప్రశ్నించారు. అలా బడ్జెట్ ప్రసంగాల్లో అన్ని రాష్ట్రాల పేర్లు ప్రస్తావించిన సందర్భం ఒక్కటైనా ఉన్నదా? అని సవాల్ చేశారు. ప్రతి బడ్జెట్‌లో అన్ని రాష్ట్రాల పేర్లు ప్రస్తావించే అవకాశం ఉండదని కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసని, ఉద్దేశపూర్వకంగానే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని విమర్శలు చేశారు.