ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం(జూలై 22న) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఉదయం పది గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్‌నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
అనంతరం సభ వాయిదా పడుతుంది. ఆతర్వాత స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో శాసనసభా వ్యవహారాల కమిటీ-బీఏసీ సమావేశం జరగనుంది. సమావేశాలను ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ నిర్ణయం తీసుకోనుంది. కేవలం ఐదు రోజులు మాత్రమే సమావేశాలు పెట్టాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏయే అంశాలపై చర్చ అనేదానిపై బీఏసీ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
గవర్నర్ ప్రసంగంపై చర్చ మంగళవారం నుంచి జరగనుంది. రీసెంట్గా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు సభ ఆమోదం లభించనుంది. వీటితోపాటు చంద్రబాబు సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రాలపై చర్చించ నున్నారు. దీనికితోడు ఎమ్మెల్యేల భద్రత విషయంపై సభలో చర్చ జరగనుంది. జగన్‌కు అధికారంలో ఉన్నప్పుడు భద్రత చట్టాన్ని తీసుకొచ్చారు. ఆయన, ఫ్యామిలీ సభ్యులుగానీ ఎక్కడ కు వెళ్లినా భద్రత ఉండేలా చట్టం తీసుకొచ్చారు. దానిపై ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకొస్తున్నట్లు సమాచారం.
సోమవారం నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్ హాజరుకానున్నారు. కేవలం గవర్నర్ ప్రసంగం సమయంలో సభకు రావాలని భావిస్తున్నారట. అప్పటివరకు వారికి కేటాయించిన ఛాంబర్లో ఉండనున్నారు. ప్రమాణ స్వీకారం సమయంలో ఎలా వ్యవహరించారో అదే విధంగా ఫాలో కావాలని వైసీపీ ఆలోచనగా నేతలు చెబుతున్నారు. ఒకవేళ ఉంటే గవర్నర్ స్పీచ్ విన్న తర్వాత దానిపై మీడియాతో నాలుగు మాటలు మాట్లాడిన తర్వాత ఢిల్లీ వెళ్లనున్నారు.