Search
Close this search box.

  ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌, నిర్మాతలకు లీగల్ నోటీసులు

కల్కి 2898 ఏడీ రికార్డులు వర్షం కురిపిస్తున్నది. పాత రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది. సినిమా కథ, ప్రధాన పాత్రల్లో నటించిన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకోన్ సహా పలువురిపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. ఇదిలా ఉండగా.. మాజీ కాంగ్రెస్ నేత, కల్కి ధామ్ పీఠాధీశ్వర్ ఆచార్య ప్రమోద్ క్రిష్ణం కల్కి నిర్మాతలు, నటులకు లీగల్ నోటీసులు పంపించారు. ఈ సినిమాలో దేవుడిని తప్పుగా చిత్రించారని, హిందూ పురాణాలకు భిన్నంగా వర్ణించారని ఆరోపిస్తూ ఈ నోటీసులు పంపారు.

‘హిందూ పురాణాలు వివరిస్తున్నట్టుగా ఈ చిత్రం లేదు. కల్కి దేవుడికి సంబంధించి మౌలిక విషయాలను కూడా ఈ సినిమా పూర్తిగా భిన్నంగా చిత్రించింది. కల్కీ దేవుడికి సంబంధించిన వృత్తాంతాన్ని పూర్తిగా తప్పుగా చిత్రించారు. ఇది పవిత్ర గ్రంథాలను అవమానించడమే అవుతుంది. ఈ గ్రంథాలే కోటాను కోట్ల మంది విశ్వాసాలకు పునాదిగా ఉన్నాయి.’ అని వారు నోటీసులో పేర్కొన్నారు.

ఈ సినిమాలో కల్కి పాత్ర చిత్రణ ఇది వరకే చాలా మంది హిందువుల్లో గందరగోళాన్ని రేపిందని, ఇది కల్కి దేవుడి ఔచిత్యాన్ని, ఆయన చుట్టు ఉన్న ఆధ్యాత్మికతను దెబ్బ తీసేలా ఉన్నదని తెలిపారు. ఇలా అర్థం చేసుకోవడమే తప్పుగా అర్థం చేసుకుంటే.. అది హిందూ విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేసే ముప్పు ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఇది మొత్తంగా హిందూ సమాజ విశ్వాసాలపై ఒత్తిడిని తెచ్చే ముప్పు ఉన్నదని పేర్కొన్నారు.

ఆచార్య ప్రమోద్ పీటీఐతో మాట్లాడుతూ.. విష్ణు అవతారాల్లో చివరిది కల్కి అవతారమని, చాలా పురాణాలు ఆయనకు అంకితమై ఉన్నాయని వివరించారు. ప్రధాని మోదీ యూపీలోని సంభల్‌లో ఫిబ్రవరి 19న కల్కి ధామ్ ఆలయానికి శంకుస్థాపన చేశారని, ఇక్కడే కల్కి జన్మిస్తారని తెలిపారు. యావత్ ప్రపంచం ఆయన కోసం ఎదురుచూస్తున్నదని పేర్కొన్నారు. కానీ, ఈ సినిమా తప్పుడు సందేశాన్ని ఇస్తున్నదని ఆరోపించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు