పార్లమెంటరీ సమావేశం సందర్భంగా సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీలతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ నుంచి పారిపోయేందుకే జగన్ ఢిల్లీ డ్రామాలు ఆడుతున్నాడని ఎద్దేవా చేశారు. శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో విడుదల చేస్తామని చెప్పారు. శ్వేతపత్రంలోని వాస్తవాలు ఎదుర్కొనే ధైర్యం జగన్ కు లేదని అన్నారు.
జగన్ పెంచి పోషించిన గంజాయి, డ్రగ్స్ సంస్కృతి వల్లే ఈ అనర్ధాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. వినుకొండ హత్య గంజాయి వల్లే జరిగినట్టు వైసీపీ నేతలే ఒప్పుకున్నారని వెల్లడించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో నేతలంతా క్రమశిక్షణ పాటించాలని అన్నారు. వైసీపీ విష ప్రచారాన్ని తిప్పికొడదామని పిలుపునిచ్చారు. కాగా, రాష్ట్ర ఖజానాను మొత్తం జగన్ ఖాళీ చేసి వెళ్లిపోయారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రాభివృద్ధిని సవాల్ గా తీసుకుని పనిచేద్దామని ఎంపీలకు నిర్దేశించారు.