Search
Close this search box.

  మోదీ ప్రభుత్వానికి కాంగ్రెస్ గట్టి కౌంటర్..!

మాజీ ప్రధాని దేశంలో ఎమర్జెన్సీ విధించిన జూన్ 25వ తేదీని సంవిధాన్ హత్య దినోత్సవంగా జరపాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనకు అనుగుణంగా గెజిట్‌ను కూడా విడుదల చేసింది. ఈ ప్రకటనపై కాంగ్రెస్ సీరియస్ అయింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మోదీ ప్రభుత్వానికి గట్టి కౌంటర్ ఇచ్చారు. జూన్ 4వ తేదీని మోదీ ముక్త దివస్‌గా జరుపుకోవాలని పిలుపు ఇచ్చారు. త్వరలోనే గెజిట్ విడుదలవుతుందని సెటైర్ వేశారు.

హెడ్‌లైన్లను మేనేజ్ చేసే నాన్ బయోలాజికల్ ప్రధాని మరోసారి ఆ పని చేశారని జైరాం రమేశ్ విమర్శించారు. పదేళ్ల నుంచి అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్న ఈ మోదీకి ప్రజలు 2024 జూన్ 4న షాక్ ఇచ్చారని తెలిపారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా, నైతికంగా కూడా ఘోర పరాజయాన్ని ప్రజలు కట్టబెట్టారని, ఈ రోజు చరిత్రలో ఇక పై మోదీ ముక్తి దివస్‌గా గుర్తుండిపోతుందని ట్వీట్ చేశారు.

రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలు, నిబంధనలు, రాజ్యాంగ సంస్థలను ఒక క్రమపద్ధతిలో ఈ నాన్ బయోలాజికల్ ప్రధాని మోదీ దాడి చేశారని జైరాం రమేశ్ విమర్శించారు. మనుస్మృతిని ఆదర్శంగా తీసుకుని రూపొందించలేదని 1949 నవంబర్‌లో భారత రాజ్యాంగాన్ని ఇదే నరేంద్ర మోదీ భావజాల పరివారం వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ఈ నాన్ బయోలాజికల్ ప్రధానమంత్రికి డెమోక్రసీ అంటే కేవలం డెమో కుర్చీ మాత్రమేనని చురకలు అంటించారు.

అదే విధంగా నవంబర్ 8వ తేదీన జీవితకాల హత్య దినంగా గుర్తించాలని జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. 2016లో నవంబర్ 8వ తేదీన ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన వీడియోను ఇందుకు జోడించారు. నోట్ల రద్దు వైఫల్యాన్ని గుర్తు చేస్తూ.. ఆ రోజును కూడా ఆజీవికా హత్యా దివస్‌గా గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ఎంతో గొప్పగా, ఘనంగా ప్రకటించిన నోట్ల రద్దు విఫల ప్రయోగంగా మారింది. ఆ తర్వాత మోదీ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని సమర్థించుకోలేకపోయింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు