పిఠాపురం ఓ ఆధ్యాత్మిక క్షేత్రం. అందుకే పవన్ తొలిసారిగా పిఠాపురం వచ్చిన తర్వాత పిఠాపురాన్ని టెంపుల్ సర్క్యూట్‌గా చేస్తానని హామి ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా పిఠాపురం నుండి గెలిచారు. ఏకంగా రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. ఈ హోదా రావడానికి మీరిచ్చిన శక్తే అంటూ పవన్ పదే పదే సభలో చెబుతున్నారు. తాజాగా పిఠాపురంలో జరిగిన వారాహి సభలో ఆయన ప్రసంగం ఆకట్టుకుంది.
అయితే పిఠాపురం అభివృద్ధికి మాత్రం పవన్ పెద్ద పీట వేస్తామని హామి ఇచ్చినప్పటికీ ఆయన చెబుతున్న హామీలు గత పాలకులు చెప్పినట్టుగానే అనిపిస్తున్నాయన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. పవన్ ఎంతో ఛాలెంజ్‌గా పిఠాపురాన్ని తీసుకుంటున్నారా.. అంటే ఏమో నిజం కావచ్చు అనే వాదన కూడా లేకపోలేదు. కానీ పవన్ చెప్పినట్టుగా అన్ని హామీలు ఇక్కడ అమలవుతాయా..అసలేం జరగబోతుందని అంతా క్వచ్చన్ మార్క్‌నే పెట్టేస్తున్నారు.
పిఠాపురం నుండి పవన్ గెలిచినప్పటి నుండి దేశ వ్యాప్తంగా పిఠాపురం పేరు మారు మోగుతోంది. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ ఆలయం ఉంది. దీని సమాంతర ఆలయం మహారాష్ట్రలో గానుగాపురంలో ఉంది. అందుకే నిత్యం ఇక్కడకు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు. ఇక పాదగయ క్షేత్రం తెలియని వారుండరు. పిండ ప్రధానాలకు పెట్టింది పేరు. రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర ఆలయంగా పేరుగాంచింది పిఠాపురం. ఇక్కడ పురుహూతికా అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. అందుకే పవన్ టెంపుల్ సర్క్యూట్ అనే పదాన్ని వాడుతున్నారనడానికి ఇన్ని దేవాలయాల సమూహం పిఠాపురం.
పవన్ ఇచ్చిన హామీల్లో ఉప్పాడ రైల్వేగేటు వద్ద వంతెన(ఆర్వోబి)నిర్మాణం 12 నెలల సమయం అడుగుతున్నారు. ఇక్కడ ఇంకా కనీసం చిన్నపాటి పని కూడా మొదలు కాలేదు. ఉప్పాడ బీచ్ అందంగా తీర్చిదిద్దుతామంటున్నారు. అక్కడ కోతకు గురయ్యే ప్రాంతం ఎక్కువగా ఉంది. సముద్రంతో బీచ్ మొత్తం మునిగిపోయింది. స్థల సేకరణ చేస్తారా.. అంటే రోడ్డు మధ్యలో ఉంది. మరీ ఉప్పాడ బీచ్ అభివృద్ధి ఏలా సాధ్యం..? ఇదే ప్రాంతంలో రోడ్డు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. పిఠాపురం ప్రభుత్వాసుపత్రి మల్టీ స్పెషాలిటీ స్థాయి అంటున్నారు. ప్రస్తుతం అక్కడ సరియైన మందులు కూడా లేని పరిస్థితి. పశువుల సంత అభివృద్ధి విషయంలో మాత్రం పనులు జరుగుతున్నాయని అంటున్నారు. ఇక శుభ్రత, తాగునీటి విషయంలో కూడా అనుకున్న ఫలితాలు రావాలంటూ సమూలమైన మార్పులు జరగాలి.
ఇంత మార్పులకు అధికారులు సహకరిస్తారా..నిధులు విడుదలవుతాయా..? ఇవన్ని కూడా ప్రశ్నల పరంపరే..నిజంగా పవన్ ఆశయానికి అనుగుణంగా ఇవన్ని జరిగితే పవన్ మించిన నాయకుడు దొరకడం కష్టం. కానీ అనుకున్న స్థాయిలో పనులు జరగకపోతే పవన్ కళ్యాణ్ సాధారణ పొలిటిషియన్ గానే షరా మాములు అనిపించుకుంటారని విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద పవన్ పాలన ఏలా ఉండబోతోంది..ఏం జరగబోతోందనేది వేచి చూడాలి.