ఎమ్మెల్యే అభ్యర్థుల కోటా కింద ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీలకు ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్లు ఈనెల 2వ తేదితో ముగియనున్నాయి. ఈనేపథ్యంలో కూటమి నుండి ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేశారు. వీరిలో ఒకరు కడప జిల్లా రాజంపేటకు చెందిన సి. రామచంద్రయ్య. మరొకరు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జనసేన రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న పిడుగు హరిప్రసాద్ లకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తున్నారు. వీరిరువురు సోమవారం నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
రామచంద్రయ్య రాజకీయ ప్రస్థానం ఇదీ
సీనియర్ పొలిటీషియన్ గా ఉన్న సి .రామచంద్రయ్య 1985లో టీడీపీ నుండి శాసనసభకు ఎన్నికై 1986–88లో రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా రెండు సార్లు పనిచేశారు. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా సహా అనేక పదవులు నిర్వహించారు . 2008లో చంద్రబాబు నాయుడుతో విభేదాల కారణంగా టీడీపీని వీడారు. ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి చేరారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతో ఆయనకు, కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ ద్వారా మంత్రిపదవి వరించింది. ఆతర్వాత కాలంలో ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైసీపీకిలోకి చేరారు. ఎన్నికల ముందు సి.రామ చంద్రయ్య టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న సమయంలోనే రామచంద్రయ్య టీడీపీలోకి చేరడంతో ఆయన ఎమ్మెల్సీ పదవిపై శాసన మండలి ఛైర్మన్ అనర్హత వేటు వేశారు. దీంతో ఆ ఎమ్మెల్సీ పదవి ఖాళీ అయ్యింది. ప్రస్తుతం టిడిపిలో కొనసాగుతున్న రామచంద్రయ్యకే తాజాగా టిడిపి నుండి ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తున్నారు.
అసలు ఈ హరి ప్రసాద్ ఎవరు..
జనసేన రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న పిడుగు హరిప్రసాద్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. దీంతో ఆయన ఎవరనే దానిపై చర్చ మొదలైంది. ఈయన జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించారు. ఈనాడు సంస్థలో డెస్క్ ఇన్‌ఛార్జి హోదాలో కూడా పనిచేశారు. ఆ తర్వాత కాలంలో రాజకీయపార్టీలకు మీడియా సలహాదారుడిగా ఉన్నారు. జనసేనలో చాలా కాలం నుండి పనవ్‌కు సంబంధించి రాజకీయ వ్యవహారాలను చూస్తున్నారు. పవన్‌కు అత్యంత సన్నిహితుల్లో హరిప్రసాద్ ఒకరు. పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగుదలలో హరిప్రసాద్ కీలక పాత్ర పోషించారని చెబుతుంటారు. అనూహ్యంగా ఆయన పేరును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో జనసేన సోషల్ మీడియా వర్గం ఆనందం వ్యక్తం చేస్తుంది.
వర్మకు..ఇక్బాల్ కు ఇప్పట్లో లేనట్టే..!
ఎమ్మెల్సీలు గా మహ్మద్ ఇక్బాల్‌కు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు దక్కుతుందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. హిందూపురంలో బాలకృష్ణ విజయానికి కృషి చేసిన ఇక్బాల్‌కు.. అలాగే పిఠాపురంలో పవన్ విజయానికి పాటుపడిన టీడీపీ నేత వర్మ కృషి చేశారు. అయితే తాజాగా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనతో వీరిద్దరికి అవకాశం దక్కలేదు. మొదటి విడతలోనే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎమ్మెల్సీ ఇస్తారని హామీ ఇచ్చారు. అయితే సి. రామచంద్రయ్య మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరడంతో, ఆయన చేసిన పదవే కావడంతో వర్మకు ఎమ్మెల్సీ అవకాశం దక్కలేదు. అలాగే జనసేన నుండి పిడుగు హరిప్రసాద్ కు పవన్ అండదండలు ఉండటంతో మంచి ఛాన్స్ కొట్టేశారు. వీరిద్దరి ఎన్నిక లాంఛనప్రాయం కానుంది.