జూలై 1న గెలిపించిన ప్రజల వద్దకు జనసేనాని
భారీగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి వరకూ మారుమోగిన పేరు. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇది నయా ట్రెండ్. ఆయనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపేందుకు తొలిసారి డిప్యూటీ సీఎం వస్తుండటంతో జిల్లా యంత్రాంగం మొత్తం పిఠాపురం వచ్చేస్తోంది.
జూలై 1న పవన్ కళ్యాణ్ పిఠాపురం వస్తున్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లను అధికారులు మొదలు పెట్టేశారు. ఎన్నికల ముందు పవన్ పిఠాపురాన్ని గుండెల్లో పెట్టుకుంటానని మాట ఇచ్చారు. టెంపుల్ సిటీ, మొత్తం పిఠాపురం రూపు రేఖలు మారిపోతాయని హామీ ఇచ్చారు. ఊహించని ఫలితాలతో పవన్ డిప్యూటీ పీఠం ఎక్కేశారు. ఇంకేముంది నిజంగా పిఠాపురం ప్రజలకు వరం దక్కిందనే ఆశతో ఎదురుచూస్తున్నారు.
చంద్రబాబు తర్వాత స్థానం ప్రస్తుతం రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ దే. కూటమి గెలుపులో కీలక భూమిక పోషించిన పవన్ రాష్ట్రంలో కీలకశాఖలైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ , సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం, అటవీశాఖలకు అధిపతిగా ఉన్నారు. పైగా ఆయన మాటకు తిరుగులేదు. అడుగేస్తే ఎదురు లేదన్నంతలా గాలి పవన్ వైపు ఉంది. ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం సలాం కొడుతున్నారు. శభాష్ అంటున్నారు. ఇక నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్‌ను తుఫాన్‌తో పోల్చారు. అంతటి ఘనకీర్తి సంపాధించిన పవన్ తనకు ఈస్థాయి ఇచ్చిన పిఠాపురం ప్రజలకు ఏం వరాలు ఇస్తారనేది అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
ఇప్పటికే కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పిఠాపురంలో పర్యటించి పిఠాపురం పట్టణంలో పవన్ మాట్లాడే బహిరంగ సభ ప్రాంగణం ఉప్పాడ బస్టాండు ప్రాంతాన్ని పరిశీలించారు. పవన్ వారాహి వాహనంపై ఇక్కడ నుండి పిఠాపురం ప్రజలనుద్దేశించి మాట్లాడతారని అంటున్నారు. ఆయన మాటల కోసం పిఠాపురం ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆయన కోసం ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు.